రైతుల ఉద్యమాన్ని వారు అదనుగా తీసుకుంటున్నారు!

రైతుల ఉద్యమాన్ని అదనుగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న తుక్డే తుక్డే గ్యాంగ్‌లపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పట్నాలోని భక్తిర్పూర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

Published : 14 Dec 2020 01:52 IST

పట్నా: రైతుల ఉద్యమాన్ని అదనుగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్‌’లపై చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పట్నాలోని భక్తిర్పూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని వారు(నిరసనకారులు) చెబుతున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులకు గౌరవం ఇస్తోంది. కానీ రైతుల ఉద్యమాన్ని అదనుగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ‘తుక్డే తుక్డే గ్యాంగ్’‌పై మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. కొందరు వ్యక్తులు రైతుల నిరసనల్లో చేరి.. దిల్లీ, మహారాష్ట్రల్లో అల్లర్లకు పాల్పడి జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలని డిమాండ్లు లేవనెత్తుతున్నారు. అలాంటి వారి లక్ష్యాల్ని మేం విజయవంతం కానివ్వం’ అని రవిశంకర్‌ వెల్లడించారు. 

‘కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవే. రైతుల్ని మండీ వ్యవస్థ నుంచి కాపాడి.. తమ ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా ఈ చట్టాలు సహకరిస్తాయి. రైతులకు అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా అని నేను అడుగుతున్నా. బిహార్‌ ప్రజలు గోర్గాన్‌ గింజల్ని స్థానికంగా ఎందుకు అమ్మాలి.. గ్లోబల్‌ మార్కెట్లో ఎందుకు విక్రయించకూడదు?’ అని చట్టాల ప్రయోజనాల గురించి రవిశంకర్‌ వివరించారు. 

‘నిరసనల్లో సంఘవిద్రోహ శక్తులు చేరి.. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.. కాబట్టి రైతులు వారిపై దృష్టి సారించాలి’ అని ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సైతం చెప్పారు. శుక్రవారం టిక్రీ సరిహద్దులో నిరసనలు చేస్తున్న వారిలో కొందరు.. వివిధ కేసుల్లో అరెస్టైన నిందితుల్ని విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని ప్రత్యేకించి పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

రేపటి నుంచి దేశవ్యాప్త ఆందోళనకు రైతులు సిద్ధం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని