4ఏళ్ల చిన్నారి.. 90గంటలు మృత్యువుతో పోరాటం

ప్రకృతి బీభత్సానికి అతలాకుతలమైన టర్కీలో నాలుగేళ్ల చిన్నారి నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. ఒంటినిండా గాయాలతో నొప్పిని భరిస్తూనే చావును ఎదరించి మృత్యుంజయురాలిగా నిలిచింది.

Published : 03 Nov 2020 15:15 IST

ఇజ్మీర్‌(టర్కీ): భూకంప బీభత్సానికి అతలాకుతలమైన టర్కీలో నాలుగేళ్ల చిన్నారి నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. ఒంటినిండా గాయాలతో నొప్పిని భరిస్తూనే చావును ఎదిరించి మృత్యుంజయురాలిగా నిలిచింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ చిన్నారిని 90 గంటల తర్వాత బయటకు తీసుకువచ్చారు. 

టర్కీ, గ్రీస్‌లో ఇటీవల భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 7.0 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. తీర ప్రాంత నగరం ఇజ్మీర్‌లో భూకంపం తీవ్రత భారీగా ఉంది. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. శిథిలాల కింద కొనఊపిరితో కొట్టుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ఐడా గెజ్గిన్‌ను గుర్తించారు. వెంటనే శిథిలాలను తీసి ఐడాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఐడా సజీవంగా బయటపడటంతో రెస్క్యూ సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు. 91వ గంటలో అద్భుతం జరిగిందని ఇజ్మీర్‌ మేయర్‌ టన్‌ సోయర్‌ ట్విటర్‌ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘రెస్క్యూ సిబ్బంది ఐడాను కాపాడారు. ఇంత బాధలోనూ చిన్నారి క్షేమంగా బయటకు రావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని సోయర్‌ తెలిపారు. భూకంపం కారణంగా టర్కీ వ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని