అలా ఐతే నేను డిబేట్‌లో పాల్గొనను: ట్రంప్‌

కరోనా వైరస్‌ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, వచ్చేవారం ప్రత్యర్థి జో బైడెన్‌తో జరగనున్న ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో.......

Published : 09 Oct 2020 01:28 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, వచ్చేవారం ప్రత్యర్థి జో బైడెన్‌తో జరగనున్న ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ను వర్చువల్‌ పద్ధతిలో జరపాలని ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ కమిషన్‌ (సీపీడీ) నిర్ణయించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. ‘వర్చువల్‌ పద్ధతిలో జరిగే డిబేట్‌లో పాల్గొని నా సమయాన్ని వృథా చేసుకోను. ఇది మాకు అంగీకారం కాదు’ అని స్పష్టంచేశారు. ఈ సమయంలో సంవాదాన్ని నిర్వహించే కమిషన్‌ను కూడా ట్రంప్‌ తప్పుబట్టారు. తన ప్రత్యర్థి బైడన్‌ను రక్షించేందుకు సీపీడీ ప్రయత్నిస్తోందని ఆరోపించడం గమనార్హం. ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన అనంతరం కొవిడ్‌ నిబంధనలు పాటించట్లేదనే విమర్శలను ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష భవనంలోనూ మాస్కు లేకుండానే దర్శనమిస్తున్నారనే వాదన కూడా ఉంది.

ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీపడే నాయకులు బహిరంగంగా చర్చించడం గతకొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ ముఖాముఖి చర్చలను కమిషన్ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ ‌(సీపీడీ) నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఈసారి సెప్టెంబర్‌ 29న ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్ మధ్య జరిగిన సంవాదం వాడీవేడీగా సాగింది. ఇది జరిగిన రెండు రోజులకే ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ ‌15, 22 తేదీల్లో జరిగే మరో రెండు చర్చలను వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు. తొలి డిబేట్‌ను ఫాక్స్‌ న్యూస్‌ చేపట్టగా.. వచ్చే రెండు డిబేట్‌లను సీ-స్పాన్‌, ఎన్‌బీసీ వార్త సంస్థలు నిర్వహించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని