శిరస్త్రాణం కొంటున్నారా.. ఇవి ఉండాల్సిందే..! 

భారత్‌లో విక్రయిస్తున్న ద్విచక్రవాహన హెల్మెట్లకు బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్డ్స్‌ ( బీఐఎస్‌) కొత్తగా తీసుకొచ్చిన భద్రతా ప్రమాణాలు ఉండాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రస్తుతం దేశంలో...........

Updated : 27 Nov 2020 22:40 IST

దిల్లీ‌: భారత్‌లో విక్రయించే ద్విచక్రవాహన హెల్మెట్ల (శిరస్త్రాణం)కు బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కొత్తగా తీసుకొచ్చిన భద్రతా ప్రమాణాలు ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న హెల్మెట్లకు బీఐఎస్‌ సర్టిఫికేట్‌, నాణ్యతా నియంత్రణ ప్రమాణాలు తప్పనిసరని పేర్కొంది. హెల్మెట్ల బరువు విషయంలో 2018లో రూపొందించిన నియమాలే ప్రస్తుతం పాటిస్తున్నారనీ.. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం హెల్మెట్‌ 1.2 కిలోల బరువు కన్నా తక్కువగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో బీఐఎస్‌ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న హెల్మెట్లను దేశంలోకి దిగుమతి చేసుకోరాదని తెలిపింది. అయితే, కొత్తగా తయారు చేసే వాటికి ఐఎస్‌ఐ మార్క్‌కూడా తప్పనిసరి అని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. దేశంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా హెల్మెట్లను ధరించాలని సుప్రీంకోర్డు నియమించిన కమిటీ గతంలో సూచించింది. ఎయిమ్స్‌, సంబంధిత ఆరోగ్య నిపుణులను సంప్రదించిన అనంతరం కమిటీ నివేదికను సమర్పించింది. ‘హెల్మెట్లు తయారు చేసే కంపెనీల మధ్య మన దేశంలో మంచి పోటీ ఉంది. దీనివల్ల నాణ్యత కలిగిన హెల్మెట్లను పొందగలం’ అని రోడ్డు రవాణా శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. దీంతో దేశంలో నాణ్యతా, నియంత్రణ ప్రమాణాల దృష్ట్యా బీఐఎస్‌ ధ్రువీకరించిన హెల్మెట్‌లు అధిక సంఖ్యలో రానున్నాయి.  భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాల మాదిరిగానే హెల్మెట్లు వాడుకలోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని