వ్యాక్సిన్‌ ట్రయల్స్‌: ఆ వాలంటీర్లు కావలెను..!

భారత్‌, ఆసియా, ఆఫ్రికా, కరేబియన్‌ ప్రాంతాలకు చెందిన అల్పసంఖ్యాక జాతుల వారు వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనాలని బ్రిటన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Published : 13 Oct 2020 20:54 IST

బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ పిలుపు

లండన్‌: కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇందులోభాగంగా ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. ఈ సమయంలో భారత్‌, ఆసియా, ఆఫ్రికా, కరేబియన్‌ ప్రాంతాలకు చెందిన అల్పసంఖ్యాక జాతుల వారు వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనాలని బ్రిటన్‌ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ‘ప్రాంతం, వర్గం బేధం లేకుండా ఎవ్వరిపైనైనా కరోనావైరస్‌ ప్రభావం చూపుతుంది. అన్నివర్గాల, వయస్సులవారిపై సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే, ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో మనమందరం భాగస్వామ్యం కావాలి’ అని యూకే బిజినెస్‌ సెక్రటరీ అలోక్‌ శర్మ పిలుపునిచ్చారు. తద్వారా వ్యాక్సిన్‌ ప్రయోగాలను మరింత వేగవంతం చేయవచ్చని సూచించారు.

‘వైరస్‌బారిన పడుతున్న వారితోపాటు మరణిస్తున్న వారిలో నల్లజాతీయులు, ఆసియా, అల్పసంఖ్యాక జాతుల వారు ఎక్కువగానే ఉన్నారు. అందుకే భిన్న వర్గాలవారు వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యం. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత విభిన్న వర్గాలు, జాతుల వారిపైనా వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆధారాలతో చూపించడానికి ఈ తరహా ప్రయోగాలు ఎంతో కీలకం’ అని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ముఖ్యపరిశోధకురాలు డాక్టర్‌ మహేషి రామసామి పేర్కొన్నారు.

బ్రిటన్‌లో కరోనావైరస్‌ తీవ్రత ఎక్కువగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ 6లక్షల 20వేల మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో ఇప్పటికే దాదాపు 43వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో వైరస్‌ బయటపడిన వారిలో శ్వేతజాతీయుల కంటే ఎక్కువ స్థాయిలో వివిధ దేశాలకు చెందిన అల్పసంఖ్యాక జాతుల వారు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ సమయంలోనే వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనేవారి పేర్లను నమోదుచేసుకునే ప్రక్రియను బ్రిటన్‌ జులైలో చేపట్టింది. ఇప్పటివరకు 2,70,000మంది అక్కడి నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)లో పేర్లను నమోదుచేసుకున్నారు. 

సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత తొందరగా తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ను యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనికా టీకాతోపాటు నొవావాక్స్‌వంటి ఆరు వ్యాక్సిన్‌లు ఇందులో ఉన్నాయి. ప్రయోగాల్లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారితోపాటు 65ఏళ్ల వయస్సు పైబడిన వారుకూడా పాల్గొనాలని ఈ టాస్క్‌ఫోర్స్‌ విజ్ఞప్తిచేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని