10లక్షల మరణాలు: ఇది ‘వేధించే మైలురాయి’

కరోనా మరణాలు పదిలక్షల మార్కును దాటడం ‘వేధించే మైలురాయి’ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు.

Published : 29 Sep 2020 13:12 IST

ఆవేదన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ సోకి మరణించిన వారిసంఖ్య పదిలక్షలు దాటింది. కరోనా మరణాలు పదిలక్షల మార్కును దాటడం ‘వేధించే మైలురాయి’ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఎంతో వేధనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఏ ఒక్కరినీ కోల్పోకుండా చూసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు.

‘వైరస్‌ అంతరించే అవకాశాలు దగ్గర్లో కనిపించడం లేదు. ముఖ్యంగా విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడంతోపాటు లక్షల ఉద్యోగాలు కోల్పోవడానికి ఈ మహమ్మారి కారణమవుతోంది’ అని గుటెర్రస్‌ విచారం వ్యక్తం చేశారు. అయితే, మహమ్మారి విసురుతున్న సవాల్‌ను ఎదుర్కోవడం మనకు సాధ్యమేనని అన్నారు. తప్పిదాలను గుర్తించి వాటికి తగ్గట్లు నిర్ణయాలను తీసుకోవాలని..ముఖ్యంగా బాధ్యతాయుతమైన నాయకత్వం, సైన్స్‌ పట్ల ప్రాధాన్యత, పరస్పర సహకారంతో వైరస్‌ను ఎదుర్కోవచ్చని ప్రపంచదేశాలకు గుటెర్రస్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం మరవకూడదని గుటెర్రస్‌ మరోసారి స్పష్టంచేశారు.

ఇదిలాఉంటే, జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3కోట్ల 33లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో పదిలక్షల (10,01,644) మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో ఇప్పటికే 2కోట్ల 31లక్షల మంది కోలుకోగా, దాదాపు మరో కోటి వరకు యాక్టివ్‌ కేసులున్నాయి. రికవరీ కేసుల్లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 51లక్షల మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో 41లక్షలు, అమెరికాలో 27లక్షల మంది కోలుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని