వ్యాక్సిన్‌ కోసం వంద కోట్ల సిరంజిలు..!

వచ్చే సంవత్సరం చివరకు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల సిరంజీలను అందుబాటులో ఉంచుతామని యునిసెఫ్‌ వెల్లడించింది.

Published : 19 Oct 2020 20:08 IST

సిద్ధం చేస్తోన్న యునిసెఫ్‌

జెనీవా: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయోగాలు తుది దశకు చేరుకున్న తరుణంలో టీకా పంపిణీపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల సిరంజిలను అందుబాటులో ఉంచుతామని యునిసెఫ్‌ వెల్లడించింది. వీటిలో ఈ సంవత్సరం చివరినాటికే 52 కోట్ల సిరంజిలను సిద్ధం చేస్తామని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌ను ముందస్తుగా పంపిణీ చేసే దేశాల్లోని తమ గోదాముల్లో ఈ 52కోట్ల సిరంజిలను నిల్వచేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి చిన్నారుల నిధి విభాగం (యునిసెఫ్‌) ప్రకటించింది. వ్యాక్సిన్‌ డోసులను ఇస్తున్నకొద్దీ ఈ సిరంజిల అవసరం ఎక్కువగా ఉంటుందని యునిసెఫ్‌ అభిప్రాయపడింది. అంతేకాకుండా వాడిన సిరంజిలను నిల్వ చేసేందుకు 50లక్షల ప్రత్యేక పెట్టెలను ఖరీదు చేస్తున్నామని తెలిపింది.

మానవ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రోగ్రాం..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను అంతంచేసేందుకు వ్యాక్సిన్‌ను అందరికీ అందించడం మానవ చరిత్రలోనే అతిపెద్ద సామూహిక కార్యక్రమంగా నిలుస్తుందని యునిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్‌రైట్టా ఫోరే అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ డోసులు తయారవుతున్న కొద్దీ అంతే వేగంగా తాము కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే, డిసెంబర్‌ నాటికి 50 కోట్ల సిరంజిలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతున్నామని యునిసెఫ్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆధ్వర్యంలో ఏర్పడ్డ కోవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఈ సిరంజిలను వినియోగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ అందించే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో కోవాక్స్‌ ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో ఏర్పడిన గవీ కూటమి (GAVI Vaccine Alliance) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రమాదకర వ్యాధులకు వ్యాక్సిన్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగం మంది చిన్నారులకు గవీ ద్వారానే అందిస్తున్నారు.

ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 42వ్యాక్సిన్‌లు మానవ ప్రయోగదశలో ఉన్నాయని.. వీటిలో పది వ్యాక్సిన్‌లు తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. మరో 156 వ్యాక్సిన్‌లు ల్యాబ్‌లలో అభివృద్ధి దశలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌లలో కేవలం పదిశాతం వ్యాక్సిన్‌లు మాత్రమే క్లినికల్‌ ట్రయల్స్‌లో విజయవంతం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని