అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర: యోగి

రాయకీయ ప్రయోజనాలకోసం కులం, మతం పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు..

Updated : 05 Oct 2020 14:50 IST

లఖ్‌నవూ: రాజకీయ ప్రయోజనాల కోసం కులం, మతం పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. 7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అంరోహా జిల్లాలోని నవ్‌గవాన్‌ సదత్‌లో ఆదిత్యనాథ్‌ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. హాథ్రస్‌లో దళిత యువతిపై జరిగిన అత్యాచారం, హత్య నేపథ్యంలోనే ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నేరుగా ప్రస్తావించకుండా అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు పలు కుట్రలు చేస్తున్నాయన్నారు.

‘ప్రతిపక్షాలు ప్రతిరోజూ ఏదోఒక కొత్త సమస్యను సృష్టిస్తూ యూపీలో కుల, మత ఘర్షణలను రేకెత్తించేందుకు కుట్ర పన్నుతున్నాయి. మేము వాటన్నింటిని పట్టించుకోకుండా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం’ అన్నారు. కరోనా కాలంలోనూ ప్రధాని మోదీ సూచనల మేరకు రాష్ట్రంలో అసాధారణమైన పనులు చేశాం. అభివృద్ధిని ఓర్వలేకపోతున్న కొందరు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రచారాన్ని తగిన జాగ్రత్తలతో నిర్వహించాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. భారీ ర్యాలీలు నిర్వహించకూడదని, తక్కువ మందితో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని స్పష్టం చేశారు.

నవ్‌గవాన్‌ సదత్‌ భాజపా ఎమ్మెల్యే, మంత్రి చేతన్‌ చౌహాన్‌ కరోనా సోకి మృతిచెందడంతో అక్కడ కూడా ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉపఎన్నికలు జరజబోయే మిగతా 6 ప్రాంతాల్లోనూ సీఎం యోగి పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి నేతలు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని