హాథ్రస్‌ ఆసరాగా సంఘవిద్రోహ కార్యకలాపాలు?

హాథ్రస్‌ హత్యాచార ఘటన, తదనంతరం జరుగుతున్న పరిణామాలపై అనేక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిపై దేశద్రోహ, అల్లర్లకు కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు..........

Published : 06 Oct 2020 13:02 IST

పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న నలుగురి అరెస్ట్‌

లఖ్‌నవూ: హాథ్రస్‌ హత్యాచార ఘటన, తదనంతరం జరుగుతున్న పరిణామాలపై అనేక విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిపై దేశద్రోహ, అల్లర్లకు కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం సాయంత్రం నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారంతా ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’(పీఎఫ్‌ఐ) అనే ర్యాడికల్‌ గ్రూప్‌నకు చెందినవారిగా పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు ఈ సంస్థే నిధులు సమకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిషేధం విధించాలని అప్పట్లో యూపీ పోలీసులు భారత ప్రభుత్వాన్ని కోరారు.  

హాథ్రస్‌కు వెళుతున్న మార్గంలో అనుమానంగా తిరుగుతున్న నలుగురిని మథురలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి శాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉన్న కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం జరిపిన విచారణలో వారికి పీఎఫ్‌ఐతో పాటు దాని అనుబంధ సంస్థ క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయన్నారు. 

హాథ్రస్‌ ఘటనను ఆసరాగా చేసుకొని కొన్ని అరాచక శక్తులు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు దేశంలో కుల ఘర్షణలు రెచ్చగొట్టేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు పన్నాగం పన్నాయని యూపీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై పలు ప్రాంతాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశాయి. ఈ కుట్రలో విదేశీ శక్తుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఇటీవల భారత్‌లో కార్యకలాపాలు నిలిసివేసిన అంతర్జాతీయ సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’పై అనుమానాలు లేవనెత్తినట్లు సమాచారం. సంస్థ సేకరించిన నిధులు పక్కదారి పట్టి అల్లర్లను రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. మనీలాండరింగ్‌ ఆరోపణల కింద ఆమ్నెస్టీపై విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇదీ చదవండి..

కుల ఘర్షణలకు కుట్ర!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని