Updated : 10 Sep 2020 13:22 IST

వెయ్యికిపైగా చైనీయుల వీసాలు రద్దు..!

భద్రతా కారణాలతో అమెరికా నిర్ణయం
విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

వాషింగ్టన్‌: చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది. భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగశాఖ వెల్లడించింది. మే నెలలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఆధారంగా ఈ వీసాల రద్దు చేసినట్లు పేర్కొంది. ‘చైనా నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థులు, పరిశోధకులకు చైనా మిలటరీతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వారు అమెరికాకు చెందిన సమాచారాన్ని తస్కరించకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్ ‌ల్యాండ్‌ సెక్యూరిటీ చీఫ్‌ చాడ్‌ వోల్ఫ్‌ వెల్లడించారు. చట్టవ్యతిరేక వ్యాపార పద్ధతులు, గూఢచర్యం పేరుతో అమెరికా మేధో సంపత్తితోపాటు కరోనా వైరస్‌ పరిశోధనా సమాచారాన్ని తస్కరించేందుకు విద్యార్థి వీసాలను చైనా దుర్వినియోగం చేస్తోందని చాడ్‌ వోల్ఫ్‌ మరోసారి ఆరోపించారు.

హాంగ్‌కాంగ్‌లో చైనా ఆగడాలను ఆరికట్టే చర్యల్లో భాగంగా ఈ మధ్యే అమెరికా అధ్యక్షుడు వెలువరించిన ప్రకటన కింద ఈ వీసా రద్దు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే ఇప్పటివరకు వెయ్యికిపైగా చైనీయుల వీసాలను రద్దు చేశామని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ప్రమాదం పొంచివున్న విద్యార్థుల సంఖ్య తక్కువేనని, ఇక్కడి చట్టాలకులోబడి వచ్చే విద్యార్థులు, పరిశోధకులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే కరోనా వైరస్‌ మహమ్మారికి చైనాయే కారణమంటూ ఆ దేశం తీరుపై అమెరికా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాలోని షిన్‌జియాంగ్ ప్రాంతంలో కార్మికులను అణచివేతకు గురవుతున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో అక్కడినుంచి వచ్చే వస్తువులను అమెరికా మార్కెట్‌లోకి రాకుండా నిరోధిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా హాంగ్‌కాంగ్ విషయంలోనూ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అమెరికా.. ఇలా సమయం దొరికినప్పుడల్లా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉంటే, అమెరికాలో దాదాపు 3లక్షల 60వేల మంది చైనీయులు ఉన్నత విద్యతోపాటు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts