కరోనా వైరస్‌: అమెరికా మరో కొత్త రికార్డు

అధ్యక్ష ఎన్నికల ఫలితాల విషయంలోనే కాకుండా..కరోనా వైరస్ విజృంభణలో కూడా అమెరికా ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది.

Updated : 07 Nov 2020 13:48 IST

గడిచిన 24 గంటల్లో 1.27లక్షలపైనే కేసులు

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాల విషయంలోనే కాకుండా..కరోనా వైరస్ విజృంభణలో కూడా అమెరికా ప్రపంచ దృష్టిని తనవైపునకు తిప్పుకుంటోంది. అగ్రదేశంలో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు నమోదు కావడమే అందుకు కారణం. గడిచిన 24 గంటల్లో 1,27,000 పైచిలుకు కరోనా కేసుల నమోదయ్యాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. మరణాల సంఖ్య 1,149గా ఉందని తెలిపింది. అలాగే, కరోనా వైరస్ ప్రారంభ దశతో పోల్చుకుంటే మరణాల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నప్పటికీ, గత నాలుగు రోజులుగా ఆ సంఖ్య వెయ్యికి పైనే ఉంటోంది.

ఆ దేశ కాలమానం ప్రకారం..శుక్రవారం సాయంత్రానికి ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవించిన దేశంగా అమెరికా నిలిచింది.  మొత్తంగా ఇప్పటివరకు 97లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా, 2,36,000 పైగా మరణాలు సంభవించాయి. శీతకాలం ప్రభావం ఎక్కువవుతుండటంతో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే వైద్యులు చికిత్సా విధానాన్ని మెరుగుపర్చుకోవడం వల్ల ప్రస్తుతం మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందని, అలాగే వైరస్ బారినపడిన వారిలో యువతే ఎక్కువగా ఉండటం కూడా మృతులు తక్కువగా ఉండటానికి కారణంగా కనిపిస్తుందన్నారు. వృద్ధులతో పోల్చుకుంటే యువతలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిచేస్తోన్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా..ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అమెరికాకు చెందిన రెండు వ్యాక్సిన్లు మోడెర్నా, ఫైజర్ అత్యవసర వినియోగానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చని సమాచారం. వ్యాక్సిన్ గురించి ఏ సమాచారమైనా డిసెంబర్‌లోగా తెలుస్తుందని ఇప్పటికే అక్కడి అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని