Published : 21 Sep 2020 17:37 IST

అమెరికా ఎన్నికల్లో ఆ రాష్ట్రాలే కీలకమట!

వాషింగ్టన్‌: నవంబర్‌ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 50 అమెరికన్‌ రాష్ట్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. చాలా వాటిలో విజయావకాశాలపై ప్రధాన పార్టీలు రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ల అంచనాలు స్పష్టంగానే ఉన్నాయి. ఈ విధంగా ఏదో ఒక రాజకీయ పార్టీనే గెలిపిస్తూ వస్తున్న రాష్ట్రాలను అమెరికాలో ‘సేఫ్‌ స్టేట్స్‌’ అని పిలుస్తారు. కాగా, కొన్నిటిలో జయాపజయాలు లెక్కలకందకుండా ఉండటంతో.. అభ్యర్ధులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఊగిసలాడే ఫలితాలకు పెట్టింది పేరు కావటంతో వీటిని ‘స్వింగ్‌ స్టేట్స్‌’ అంటారు. ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉంటుందని భావించే 12 స్వింగ్‌ స్టేట్స్‌లో ఫ్లోరిడాతో సహా అరిజోనా, జార్జియా, అయోవా, మెయిన్‌, మిషిగన్‌, మిన్నెసోటా, నెవాడా, న్యూ హాంప్‌షైర్‌, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విన్కాన్సన్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల ప్రజలకు రాజకీయంగా స్పష్టమైన అభిప్రాయాలు ఉండటంతో జయాపజయాలు ఊహించటం చాలా కష్టమని భావిస్తారు. ఈ రాష్ట్రాల ఓటర్లను ఆకట్టుకునేందుకు అధ్యక్ష అభ్యర్థులు వీటిపై మరింత శ్రద్ధ కనపరుస్తుంటారు.

ఫలితాలు తారుమారు

‘స్వింగ్‌ స్టేట్స్‌’లో  కాస్త అటూఇటూగా ఫలితాలు తారుమారు కావటం పరిపాటి. కాగా, రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్‌ స్టేట్స్‌ అయిన ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాలే జయాపజయాలను నిర్ణయించే కీలకమని ఓ తాజా ఎన్నికల సర్వే వెల్లడించింది. సీబీఎస్‌ న్యూస్‌ బ్యాటిల్‌ గార్డ్‌ ట్రాకర్‌ చేపట్టిన ఎన్నికల సర్వేలో ఈ రెండు రాష్ట్రాల్లో రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల మధ్య వ్యత్యాసం కేవలం రెండు శాతం అని తెలిసింది. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ఫ్లోరిడాలో రెండు శాతం ఆధిక్యతలో ఉండగా.. టెక్సాస్‌లో ట్రంప్‌ బైడెన్‌పై అదే రెండు శాతం ఆధిక్యతలో ఉండటం విశేషం. అయితే 2016 నాటి ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాల్లో విజయం ట్రంప్‌దే కావటం గమనార్హం. టెక్సాస్‌ విషయానికి వస్తే 1976 లో జిమ్మీ కార్టర్‌ అనంతరం ఇప్పటి వరకు ఇక్కడ ఏ డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి విజయం సాధించలేదు.

ఎవరికి ఎంతంటే..

స్వింగ్‌ స్టేట్స్‌లో మొత్తంగా చూస్తే మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్‌  45 నుంచి 51 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు సీబీఎస్‌ సర్వేలో తెలియవచ్చింది. ఇక ఆదివారం నాటి ఎన్‌బీసీ న్యూస్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ల జాతీయ స్థాయి సంయుక్త సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌  బైడెన్‌ 51 నుంచి 43 శాతం ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నట్టు తెలిసింది. నల్ల జాతీయులలో ఏకంగా 90 శాతం మంది బైడెన్‌ పక్షాన ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఇక మహిళల్లో 57 శాతం, పట్టభద్రులైన శ్వేత జాతీయుల్లో 54 శాతం ఆయనే తమ అధ్యక్ష అభ్యర్థి అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ట్రంప్‌ తనకు పెట్టని కోటగా భావించే పట్టభద్రులు కాని శ్వేత జాతీయులు 59 శాతం ఉన్నారు. శ్వేత జాతి ఓటర్లలో 52 శాతం, మొత్తం పురుషులు 50 శాతం ట్రంప్‌ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో గెలవటానికి అవసరమయ్యే  270 ఎలక్ట్రోరల్‌ ఓట్లలో 29 ఓట్లను అందించే ఫ్లోరిడాలో గెలిచిన వారినే అధ్యక్ష పదవి వరించే అవకాశం ఎక్కువని పరిశీలకులు అంటున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని