
ఎబోలా చికిత్సకు అమెరికా గ్రీన్ సిగ్నల్
వాషింగ్టన్: కరోనా వైరస్ సృష్టించిన విలయంతో అందరి దృష్టీ ఇప్పుడు ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడంపైనే ఉంది. ప్రపంచదేశాలన్నీ దీనికోసమే తలమునకలై ప్రయత్నిస్తున్నాయి. దీని ప్రభావంతో ఇతర వైరస్‌ల గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసిన ఎబోలా వైరస్ గురించి చాలా మంది ఇప్పటికే మర్చిపోయారు. అయితే తాజాగా ఎబోలా చికిత్సకు తొలిసారిగా అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. రీజెనరాన్ ఫార్మాకంపెనీ అభివృద్ధి చేసిన ఔషధానికి పచ్చజెండా ఊపింది. ఎబోలా వైరస్‌తో బాధపడే చిన్నారులకు, పెద్దలపైనా దీనిని ప్రయోగించవచ్చని తెలిపింది. ఎబోలా వైరస్ కారణంగా గత జూన్ చివరి వరకు ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో దాదాపు 2300 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రీజెనరాన్ సంస్థ ‘ఇన్‌మాజెబ్’ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీనిని నాలుగు దశల్లో పరీక్షించిన అనంతరం అమెరికా డ్రగ్ నియంత్రణ సంస్థ ఆమోదం ముద్రవేసింది. గత డిసెంబర్‌లోనే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆఫ్రికా దేశాలతోపాటు, వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభలే వైరస్‌లకు, వ్యాధులకు ఔషధాలు కనిపెట్టినప్పుడు తొలుత అమెరికాలో అత్యుత్తమ ప్రమాణాను పాటించే ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి తీసుకొంటారని పరిశోధనకు నాయకత్వం వహించిన లిప్‌సిచ్ తెలిపారు. ఇప్పటికే ఎఫ్‌డీఏ అనుమతి పొందడంతో మిగిలిన అనుమతులు పొందడం కాస్త సులువైందన్నారు. పరిశోధనలో భాగంగా కాంగోలోని 681 మంది బాధితులపై 4 విడతల్లో ఔషధాన్ని ప్రయోగించారు. ఎబోలా వైరస్‌కు గైలీద్ సంస్థ తయారు చేసిన ‘రెమిడిసివిర్’ను వినియోగించారు. అయితే ఇది బాధితులపై అంతగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు.
ఈ వైరస్ ఒకరి శరీరాన్ని మరొకరు తాకడం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వారి శరీరంలోని ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుంది. మృతదేహాలను తాకడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఎబోలా వ్యాధి నుంచి కోలుకున్న పురుషుల్లోని శుక్రకణాలు నుంచి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గతంలోనే రుజువైంది. ఆ వ్యక్తిలో వైరస్ లక్షణాలు దీర్ఘకాలికంగా కనిపించకపోయినప్పటికీ కూడా వారి వీర్యంలో వైరస్ అలానే ఉంటుంది. అయితే శృంగారం ద్వారా ఎబోలా సోకుతుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవు.