వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మా దారి మాదే!

ప్రపంచమంతా కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ ప్రపంచ దేశాల కూటమితో తాము.............

Published : 02 Sep 2020 10:56 IST

ప్రపంచంతో సంబంధం లేదంటున్న అమెరికా

వాషింగ్టన్‌: ప్రపంచమంతా కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ ప్రపంచ దేశాల కూటమితో తాము కలిసి నడవబోమని తెలిపింది. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వంటి సంస్థల నిబంధనలతో తమని తాము నిర్బంధించుకోదలచుకోలేదని వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా సహా డబ్ల్యూహెచ్‌వో కూడా కారణమైందని ఆరోపిస్తూ సంస్థ సభ్యదేశాల నుంచి అమెరికా ఇప్పటికే వైదొలిగిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సరిపడా డోసులు లభించేలా కొన్ని దేశాలు ముందుగానే జాగ్రత్తపడుతున్నాయి. ఈ క్రమంలో తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నాయి. టీకా అభివృద్ధి, దాని పంపిణీ కోసం పరస్పరం సహకరించుకునేందుకు సిద్ధపడుతున్నాయి. అందులో భాగంగా డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్వంలో 150 దేశాలు కొవాక్స్‌ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. వివిధ దశల్లో ఉన్న పలు కరోనా వ్యాక్సిన్లను అందిపుచ్చుకుని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తద్వారా ఏ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తే దాన్నుంచి వీలైనంత త్వరగా లబ్ధి పొందేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, కొన్ని దేశాలు ఒంటరిగా చేసుకుంటున్న ఒప్పందాల్ని కూడా డబ్ల్యూహెచ్‌వో ప్రోత్సహిస్తోంది. కూటమిగా విఫలమైనా.. వ్యక్తిగతంగా చేసుకున్న ఒప్పందాలతో అందిన వ్యాక్సిన్‌ డోసులు ఉపయోగపడొచ్చునని తెలిపింది. 

ట్రంప్‌ పాలకవర్గం నిర్ణయంపై అమెరికాలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. మహమ్మారిని ఓడించాలన్న లక్ష్యాన్ని ఇది నీరగార్చే ప్రమాదం ఉందని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు అమీ బెరా విచారం వ్యక్తం చేశారు. కొవాక్స్‌లో చేరడం వల్ల ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించే భరోసా ఏర్పడుతుందని తెలిపారు. ఈ విషయంలో ఒంటెద్దు పోకడ వైఖరి అవలంబించడం వల్ల వ్యాక్సిన్‌ అందే అవకాశమే లేకుండా పోవచ్చునని అభిప్రాయపడ్డారు. దీని వల్ల అమెరికా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థమైన వ్యాక్సిన్‌కు అమెరికావాసులను దూరం చేసిన వారవుతారని ట్రంప్‌ పాలకవర్గాన్ని హెచ్చరించారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనాను నయం చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధికి వివిధ దేశాలు విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, మోడెర్నా వంటి సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. ఇవి ఈ సంవత్సరాంతం లేదా 2021 జనవరి చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో అమెరికా చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని