Ukraine Crisis: చమురు దిగుమతుల్ని రాజకీయం చేయడం తగదు

ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై వస్తున్న విమర్శలను భారత్‌ గట్టిగా తిప్పికొట్టింది. దేశీయ అవసరాలకు దిగుమతులే కీలకమైనందున...ఎక్కడ చౌక ధరలకు చమురు లభించినా కొనుగోలు చేస్తుంటామని,

Updated : 19 Mar 2022 05:17 IST

తక్కువ ధరకు ఎక్కడ లభించినా తీసుకుంటాం
ఇది నిరంతర ప్రక్రియ
రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై వస్తున్న విమర్శలకు భారత్‌ దీటుగా సమాధానం
మేమూ నేరుగా సరఫరా చేస్తాం: ఇరాన్‌

దిల్లీ: ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై వస్తున్న విమర్శలను భారత్‌ గట్టిగా తిప్పికొట్టింది. దేశీయ అవసరాలకు దిగుమతులే కీలకమైనందున...ఎక్కడ చౌక ధరలకు చమురు లభించినా కొనుగోలు చేస్తుంటామని, ఉత్పత్తిదారుల నుంచి అటువంటి ఆఫర్లను ఆహ్వానిస్తుంటామని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇంధన వనరుల్లో స్వయంసమృద్ధి సాధించిన దేశాలు, రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్న దేశాలు భారత చట్టబద్ధ దిగుమతులను  రాజకీయం చేయడం తగదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పెరిగిపోతున్న ఇంధన ధరలకు ఉక్రెయిన్‌ పరిణామాలు మరింతగా ఆజ్యం పోశాయని, భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను ఇది మరింత ఒత్తిడికి గురిచేసిందని వివరించాయి. దేశ ముడి చమురు అవసరాల్లో రష్యా దిగుమతులు ఒక్క శాతం కన్నా తక్కువేనని తెలిపాయి. అదీ కూడా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య వ్యాపారం జరగడంలేదని గుర్తు చేశాయి. భారత వ్యాపారులు ప్రపంచ మార్కెట్లలో ఎక్కడ చౌకగా ఇంధనం లభిస్తే అక్కడి నుంచి కొనుగోళ్లు జరుపుతున్నారని స్పష్టం చేశాయి. రష్యా నుంచి డిస్కౌంట్‌ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసే విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి కూడా తోసిపుచ్చలేదు. గురువారం దిల్లీలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ‘‘ఇంధన అవసరాలకు భారత్‌ అత్యధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయ అవసరాల రీత్యా ప్రపంచ మార్కెట్లలో ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తుంటాం. అనేక దేశాలు, ముఖ్యంగా ఐరోపా దేశాలు కూడా ఇదే పనిచేస్తున్నాయి. భారత్‌పై విమర్శలు చేసే వారిని వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా’’ అని తెలిపారు. రష్యా, భారత్‌ల మధ్య రూబుల్‌, రూపాయి మారకంలో వాణిజ్యం గతంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు.


చమురు సరఫరాకు ఇరాన్‌ సిద్ధం

భారత్‌ ఇంధన అవసరాలను తీర్చేందుకు ఇరాన్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశ రాయబారి వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం...మూడో పక్షం(థర్డ్‌పార్టీ)తో సంబంధం లేకుండా నేరుగానే భారత్‌కు చమురును సరఫరా చేయనుంది. ఇరుదేశాల కరెన్సీ(రూపాయి-రియాల్‌)లోనే లావాదేవీలు జరుపుకోవచ్చని భారత్‌లో ఇరాన్‌ రాయబారి అలీ చెగెనీ ఓ కార్యక్రమంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇరాన్‌...భారత్‌ రిఫైనరీలు చెల్లించాల్సిన మొత్తాలను ఇక్కడి బ్యాంకుల్లోనే రూపాయిల్లో జమ చేసి, ఆ మొత్తాలను భారత్‌ నుంచి కొనుగోళ్లకు వినియోగించేది.

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్‌ చమురుపై  నిషేధం విధించడంతో భారత్‌ దిగుమతులను నిలిపివేసింది. అప్పటి వరకూ భారత్‌కు ఇరాన్‌ రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉండేది. రెండు దేశాల మధ్య 2019లో 17 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యం ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 2 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది. ఇరాన్‌ నుంచి భారత్‌కు చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభమైనట్లయితే రెండు దేశాల మధ్య వాణిజ్యం 30 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అలీ చెగానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని