వీలైతే వారి ఫొటోలు వేలాడదీయండి: గడ్కరీ

ఒక ప్రభుత్వ భవన నిర్మాణం పూర్తిచేయడానికి అధికారులు 12 సంవత్సరాల సమయం తీసుకోవడంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Published : 29 Oct 2020 12:46 IST

అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి 

దిల్లీ: ఒక ప్రభుత్వ భవన నిర్మాణం పూర్తిచేయడానికి అధికారులు 12 సంవత్సరాల సమయం తీసుకోవడంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమంటూ ఆ భవనాన్ని ప్రారంభిస్తూ వ్యాఖ్యానించారు. దిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆ నిర్మాణానికి 12 సంవత్సరాలు పట్టినట్లు గడ్కరీ గుర్తించారు. రూ.250 కోట్ల విలువైన ఆ ప్రాజెక్టు 2008లో తుది ఆమోదం పొందిందని, 2011లో దానికి టెండర్ ఇచ్చారని, మరో తొమ్మిది సంవత్సరాల తరవాత దాని నిర్మాణం పూర్తయిందని గ్రహించిన ఆయన..ఇది సిగ్గుపడాల్సిన విషయమంటూ అసహనం వ్యక్తం చేశారు. దాని నిర్మాణం పూర్తయ్యేలోపులో రెండు ప్రభుత్వాలు, ఎనిమిది మంది ఛైర్మన్లు మారిపోయారన్నారు.

‘ప్రస్తుత ఛైర్మన్‌, ఇతర అధికారులకు దీనితో సంబంధం లేదు. 2011 నుంచి 2020 వరకు ఈ పనులను పర్యవేక్షించిన అధికారుల ఫొటోలను వీలైతే గోడకు వేలాడదీయాలి. నిర్ణయాలు తీసుకోవడంలో తొమ్మిది సంవత్సరాలు ఆలస్యం చేశారు. దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను రెండు, మూడేళ్లలో పూర్తి చేస్తామని మేం గర్వంగా చెప్తున్నాం. దీని విలువ రూ.80వేల నుంచి రూ. లక్ష కోట్లు. కానీ, రూ.250 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది’ అంటూ గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, సోమరితనంతో సరిగా పనిచేయని ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని