ప్రణాళికరహిత టీకా పంపిణీతో కొత్త స్ట్రెయిన్లు..!

కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారికే తొలుత టీకాలు వేయాలని ప్రజారోగ్య నిపుణుల

Updated : 11 Jun 2021 12:56 IST

దిల్లీ: కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారికే తొలుత టీకాలు వేయాలని ప్రజారోగ్య నిపుణుల బృందమొకటి కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గంపగుత్తగా అందరికీ వ్యాక్సిన్లు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సముచితం కాదని పేర్కొంది. ప్రణాళిక రహితంగా టీకా పంపిణీని నిర్వహిస్తే కొత్త రకం స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే కొవిడ్‌ బారిన పడ్డవారికి వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ (ఐపీహెచ్‌ఏ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడమాలజిస్ట్స్‌ (ఐఏఈ), ఎయిమ్స్‌ వైద్యులతో కూడిన బృందం ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ నివేదికను సమర్పించింది. 

నిపుణుల నివేదికలోని ముఖ్యాంశాలివీ.. 

అందరికీ టీకా వేయడం కంటే, లక్షిత వర్గాలకు ప్రాధాన్య క్రమంలో వాటిని అందించడం మేలు.
యువత, చిన్నారులకు ఇప్పుడు టీకా పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. సామూహికంగా, విచక్షణరహితంగా, అసంపూర్తిగా ఈ క్రతువును నిర్వహిస్తే వైరస్‌లో మ్యుటేషన్లు చోటుచేసుకొని కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ముప్పుంది.
ఇప్పటికే కరోనా బారిన పడ్డవారికి టీకాలు అందించడం అనవసరం.
టీకా అనేది కరోనాపై శక్తిమంతమైన ఆయుధం. దాన్ని వాడకుండా మన దగ్గరే అట్టిపెట్టుకోకూడదు. అలాగని విచక్షణరహితంగా ఉపయోగించకూడదు. స్వల్ప ఖర్చులో, అత్యధిక ప్రయోజనాలను రాబట్టుకునేలా వ్యూహాత్మకంగా వాడుకోవాలి.
> డెల్టా వేరియంట్‌ విజృంభణతో కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం వంటి అవకాశాలను పరిశీలించాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో మరణాలను తగ్గించడంపై ఎక్కువగా దృష్టిసారించాలి. కొవిడ్‌ దెబ్బకు మరణిస్తున్నవారిలో వృద్ధులు, ఊబకాయం/ఇతర అనారోగ్యాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు టీకా అందించడం ఆర్థికంగా ప్రయోజనకరం కాదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని