Weather: అసాధారణ వాతావరణం చంపేస్తోంది

వాతావరణ మార్పుల వల్ల తలెత్తిన అసాధారణ వేడి, శీతల ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో ఏటా 7.4 లక్షల మంది

Updated : 09 Jul 2021 11:09 IST

భారత్‌లో ఏటా 7 లక్షల మంది బలి 
 ‘లాన్సెట్‌’ అధ్యయనంలో వెల్లడి 

దిల్లీ: వాతావరణ మార్పుల వల్ల తలెత్తిన అసాధారణ వేడి, శీతల ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో ఏటా 7.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంతర్జాతీయ శాస్త్రవేత్తల అధ్యయనం పేర్కొంది. ఇదే సమస్యతో ఏటా ప్రపంచవ్యాప్తంగా మరో 50 లక్షల మరణాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. ఆస్ట్రేలియాలోని మోనాష్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన వివరాలు ‘ద లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. 2000 నుంచి 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాలు, నమోదైన ఉష్ణోగ్రతల డేటాను పరిశీలించారు. ఆ కాలంలో అంతర్జాతీయ ఉష్ణోగ్రతలు దశాబ్దానికి 0.26 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరగడం ఇక్కడ గమనార్హం. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలకు, మరణాల రేటుకు మధ్య లంకెను గుర్తించిన మొదటి అధ్యయనం ఇదేనని పరిశోధకులు తెలిపారు. ఇందులో వెల్లడైన అంశాలివీ.. 
* 2000 నుంచి 2019 వరకూ అన్ని ప్రాంతాల్లోనూ వేడి పెరిగింది. దీన్నిబట్టి వాతావరణ మార్పులతో ఉత్పన్నమవుతున్న భూతాపం వల్ల భవిష్యత్‌లో మరణాలు పెరుగుతాయని స్పష్టమవుతోంది.  
ప్రపంచవ్యాప్తంగా ఏటా జరుగుతున్న మరణాల్లో.. అసాధారణ వాతావరణం వల్ల సంభవిస్తున్నవి 9.43 శాతం మేర ఉండొచ్చు. ప్రధానంగా శీతల వాతావరణం వల్లే ఇది జరుగుతోంది. 
భూతాపం వల్ల స్వల్పంగా ఈ తరహా మరణాలు తగ్గుముఖం పట్టొచ్చు. విపరీతమైన చలి వల్ల చోటుచేసుకునే చావులు తగ్గడమే ఇందుకు కారణం. అయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించే మరణాలు కొనసాగడం వల్ల.. దీర్ఘకాలంలో వాతావరణ మార్పుల వల్ల చావులు పెరుగుతూనే ఉంటాయి. 
భారత్‌లో అసాధారణ శీతల వాతావరణం కారణంగా ఏటా మరణాలు 6,55,400 మేర ఉండొచ్చు. అధిక వేడి వల్ల 83,700 మంది ప్రాణాలు కోల్పోయారు. 
2000 నుంచి 2019 వరకూ చలి వల్ల చోటుచేసుకున్న మరణాలు 0.51 శాతం మేర తగ్గాయి. వేడి వల్ల 0.21 శాతం మేర పెరిగాయి. 
అసాధారణ చలి, వేడి వల్ల నమోదవుతున్న మరణాల్లో సగం కన్నా ఎక్కువ ఆసియాలోనే చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తూర్పు, దక్షిణాసియాలో అవి ఎక్కువగా సంభవిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని