కరోనా వేళ..గాలికాలుష్యంతో మరింత ముప్పు!

గాలి కాలుష్యం వల్ల కరోనా మరణాల ముప్పు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Published : 08 Oct 2020 16:25 IST

అమెరికా పరిశోధనల్లో వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. గాలి కాలుష్యం వల్ల దీని ముప్పు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తాజాగా మరో పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు తీవ్ర అస్వస్థతకు గురైన కరోనా రోగుల్లో తీవ్రతను మరింతగా పెంచుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు అమెరికాలోని దాదాపు 3,122 ప్రాంతాల్లో గాలిలో ఉండే పార్టికల్‌ మాటర్‌(పీఎం2.5), నైట్రోజన్‌ డయాక్సైడ్‌, ఓజోన్‌ స్థాయిలను సమీక్షించారు. అనంతరం, పట్టణాల్లో ఉండే కాలుష్యం కరోనా తీవ్రతను మరింత పెంచుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. తాజాగా ఈ పరిశోధన నివేదిక ది ఇన్నోవేషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.

గాలికాలుష్యం వల్ల కరోనా రోగుల్లో ఎలాంటి ప్రభావాలు ఎదురవుతున్నాయనే విషయంపై అమెరికా శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ మరణాల రేటు, మరణాల సంఖ్యను విశ్లేషించారు. కొవిడ్‌ సోకిన వ్యక్తి మరణించడంలో కేవలం నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు పాత్ర కీలకంగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. ముఖ్యంగా నైట్రోజన్‌ డయాక్సైడ్‌ స్థాయి గాలిలో 4.6పీపీబీ (పార్ట్స్‌ పర్‌ బిలియన్‌) పెరుగుదలతో 11శాతం కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నట్లు గ్రహించారు. ఇది కొవిడ్‌ మరణాల రేటులో 16శాతం. కేవలం నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు 4.6పీపీబీకి తగ్గించగలిగినట్లయితే దాదాపు 14,672మంది కొవిడ్‌ సోకిన వారిని మృత్యువు నుంచి కాపాడవచ్చని పరిశోధకులు తేల్చారు. వీటితోపాటు పీఎం2.5 కాలుష్యకారకాల ప్రభావం కొవిడ్‌ మరణాలపై స్వల్పంగా ఉండగా.. ఓజోన్‌ ప్రభావం మాత్రం అంతగా లేదని పరిశోధనా బృందం తేల్చింది.

దీర్ఘకాలంతో పాటు స్వల్ప సమయంలో కూడా గాలికాలుష్యానికి గురైనప్పుడు వీటి ప్రభావం మానవ శరీరంపై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టంచేస్తున్నారు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, తీవ్రమైన మంట కలిగించడంతోపాటు శ్వాసకోశ వ్యాధులు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ శాస్త్రవేత్త డోంఘై లియాంగ్‌ అభిప్రాయపడ్డారు. దీంతో పట్టణాల్లోని గాలికాలుష్యం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన కొవిడ్‌ రోగులు మరణాలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. నైట్రోజన్‌ డయాక్సైడ్‌ వాయువు ఎక్కువ మోతాదులో ఉండే న్యూయార్క్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోని మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కరోనావైరస్‌ శ్వాసకోశ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శ్వాసకోశ వ్యాధిగ్రస్తులున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. న్యూమోనియా, ఆస్తమా వంటి వ్యాధులతోపాటు చలికాలంలో గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది వాయుకాలుష్యం మూలంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని