నవంబర్‌ నాటికే చైనా వ్యాక్సిన్‌ సిద్ధం..!

మూడు వ్యాక్సిన్‌లు నవంబర్‌ నాటికి ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావచ్చని చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది.

Published : 15 Sep 2020 12:11 IST

చైనా సీడీసీ నిపుణుల వెల్లడి

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్‌లు తుదిదశ ప్రయోగాల్లో ఉన్న విషయం తెలిసిందే. వీటిలో చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన నాలుగు వ్యాక్సిన్‌లు తుదిదశ మానవ ప్రయోగాల్లో ఉన్నాయి. తాజాగా వీటిలో మూడు టీకాలు నవంబర్‌ నాటికి ప్రజా వినియోగానికి అందుబాటులోకి రావచ్చని చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. ‘మూడోదశలో ఉన్న ఈ టీకా‌ ప్రయోగాలు సాఫీగా సాగుతున్నాయి. ఇవి నవంబరు లేదా డిసెంబరు నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’ అని చైనా సీడీసీ బయోసేఫ్టీ నిపుణులు గైఝెన్‌ వూ అక్కడి అధికారిక మీడియాలో పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో తాను కూడా వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు వెల్లడించిన గైఝెన్‌ వూ, ఇప్పటివరకు ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించలేదని స్పష్టం చేశారు. అయితే, నాలుగు వ్యాక్సిన్‌లలో ఏ వ్యాక్సిన్‌ను తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె తెలియజేయలేదు.

చైనా జాతీయ ఫార్మా గ్రూప్‌(సినోఫార్మ్‌), సినోవాక్‌ బయోటెక్‌తో కలిసి మూడు వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేశాయి. ఇప్పటికే వీటి ప్రయోగాలు చైనాతోపాటు యూఏఈలోనూ కొనసాగుతున్నాయి. మూడో దశ ప్రయోగాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది చివరి నాటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సినోఫార్మ్‌ జులై నెలలోనే ప్రకటించింది. ఇక చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్‌ తయారుచేసిన మరో వ్యాక్సిన్‌ కూడా తుది దశ ప్రయోగాల్లో ఉండగా..ఇప్పటికే చైనా సైన్యం దీన్ని వినియోగించేందుకు జూన్‌లోనే అనుమతులు వచ్చాయి.

కరోనా వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలతోపాటు ఫార్మా కంపెనీలు కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వ్యాక్సిన్‌ కోసం కంపెనీలపై కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా, యూరప్‌కు చెందిన తొమ్మిది వ్యాక్సిన్‌ అభివృద్ధి కంపెనీలు మాత్రం, శాస్త్రీయంగా క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తైన తర్వాతే వ్యాక్సిన్‌ను ప్రజా వినియోగానికి విడుదల చేయాలని ఈ మధ్యే ప్రతిజ్ఞ చేశాయి. ఈ సమయంలో చైనా వ్యాక్సిన్‌ నవంబర్‌, డిసెంబర్‌ నాటికే అందుబాటులోకి వస్తుందని చైనా సీడీసీ ప్రకటించడం ఆసక్తిగా మారింది.

యూఏఈలో వాడకానికి అనుమతి..

చైనా సినోఫార్మ్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ మూడోదశ ప్రయోగాలు యూఏఈలో జరుగుతున్నాయి. గత ఆరు వారాలుగా అక్కడి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే, కరోనా పోరులో ముందువరుసలో ఉన్న వారికి ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూఏఈ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ విభాగం ట్విటర్‌లో వెల్లడించింది. తొలి రెండుదశల ప్రయోగ ఫలితాలు సురక్షితంగా ఉండడంతోపాటు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలడంతోనే వీటికి అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే సినోఫార్మ్‌ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో దాదాపు 31వేల మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు సమాచారం.

ఇవీ చదవండి..
నవంబర్‌ 1కల్లా అమెరికాలో వ్యాక్సిన్‌ సిద్ధం!
కరోనా విస్తృత వ్యాక్సినేషన్‌ ఇప్పట్లో లేనట్టే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని