ట్రంప్‌ మద్దతుదారుల నిరసన హింసాత్మకం

‘మిలియన్‌ మాగా మార్చ్‌’ పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.........

Updated : 15 Nov 2020 13:31 IST

ప్రత్యర్థి వర్గంతో బాహాబాహీ

వాషింగ్టన్‌: ‘మిలియన్‌ మాగా మార్చ్‌’ పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్‌నకు మద్దతుగా.. ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వేలాది మంది రాజధాని వాషింగ్టన్‌లో నిరసన ర్యాలీ చేపట్టారు. వీరిలో ‘ప్రౌడ్‌ బాయ్స్‌’, యాంటిఫా వంటి కన్సర్వేటివ్‌ గ్రూప్‌ సభ్యులు ఉన్నారు. వీరికి ప్రత్యర్థి వర్గమైన ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ బృందం ఓ సందర్భంలో ఎదురుపడింది. దీంతో ఇరువర్గాలు ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. అవి శృతిమించడంతో బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. చీకటి పడుతున్న కొద్దీ ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. ట్రంప్‌ మద్దతు వర్గాల చేతిలో ఉన్న ఎరుపు రంగు టోపీలు, జెండాలను లాక్కొని ప్రత్యర్థి వర్గం వాటికి నిప్పంటించింది. వీటిని అమ్ముతున్న టేబుళ్లను ధ్వంసం చేసింది. దీంతో పరిస్థితి ఓ దశలో చేజారిపోయింది. ఇదంతా శ్వేతసౌధానికి కొద్ది దూరంలోనే ఉన్న ఫ్రీడం ప్లాజా వద్ద చోటుచేసుకుంది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు పెప్పర్‌ స్ప్రే వంటి వాటిని ఉపయోగించాల్సి వచ్చింది. మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

తొలుత ట్రంప్‌ మద్దతుదారులైన ‘ఉమెన్‌ ఫర్‌ అమెరికా ఫస్ట్‌’ గ్రూపు నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నానికి వేలాది మంది ఫ్రీడం ప్లాజాకు  చేరుకున్నారు. ఈ క్రమంలో వీరి ప్రత్యర్థి వర్గం ‘రిఫ్యూజ్‌ ఫాసిజం’ ప్లకార్డులతో అటుగా వచ్చారు. వెంటనే ట్రంప్‌ మద్దతుదారులు వారిని చుట్టుముట్టి ‘యూఎస్‌ఏ’ ‘యూఎస్‌ఏ’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఘర్షణ ప్రారంభమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని