హెర్డ్‌ ఇమ్యూనిటీ ఇంకా ప్రారంభం కాలేదు

రోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే 50 నుంచి 60 శాతం మంది ప్రజలు రోగనిరోధక శక్తిని కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త...

Published : 24 Jul 2020 23:52 IST

లండన్‌: కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే 50 నుంచి 60 శాతం మంది ప్రజలు రోగనిరోధక శక్తిని కలిగి ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) శాస్త్రవేత్త డా. సౌమ్య స్వామినాథన్‌ అంచనా వేశారు. అయితే అందుకు అవసరమైన స్థాయిలో హెర్డ్‌ ఇమ్యూనిటీని ప్రజలు ఇంకా సాధించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక సామాజిక మాధ్యమానికి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న పలు దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఆయా దేశాల్లోని 5 నుంచి 10 శాతం మంది ప్రజలు ప్రస్తుతం యాంటీబాడీలను కలిగి ఉన్నారు. కొన్ని దేశాల్లో ఇది 20 శాతంగా ఉంది. ఒక దేశం నుంచి మరో దేశానికి వైరస్‌ వ్యాప్తి చెందుతున్నప్పుడు, అక్కడి ప్రజలు తమలో యాంటీబాడీస్‌ను పెంచుకోవాలి. అటువంటి వారు రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి, కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలరు’’ అని సౌమ్య అన్నారు.

మరి కొంతమంది నిపుణులు మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీకి 70 నుంచి 80 శాతం మంది ప్రజలు యాంటీబాడీలను కలిగి ఉండాలని అంచనా వేస్తున్నారు. వైరస్‌ తొలినాళ్లలో పలు దేశాలు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని భావించాయి. అయితే హెర్డ్‌ ఇమ్యూనిటీ ప్రజల్లో వైరస్‌ వ్యాప్తి ద్వారా కాకుండా వ్యాక్సిన్‌ ద్వారా సాధించడం ఎంతో సురక్షితమని సౌమ్య అభిప్రాయపడ్డారు. అప్పుడే సమర్థంగా వైరస్‌ కట్టడిని అడ్డుకోగలమని తెలిపారు. ఒక వేళ సహజ సంక్రమణ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే ప్రజలు అనేక సార్లు వైరస్‌ను ఎదుర్కొనవలసి రావచ్చని, దాని వల్ల ప్రస్తుతం చూస్తున్నట్లుగానే ఎక్కువ మరణాలు చూడవలసి రావచ్చని ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని