బెంగళూరు అల్లర్లు: దోషుల నుంచే నష్ట పరిహారం

కొద్దిరోజుల క్రితం బెంగళూరులో చోటుచేసుకున్న ఆందోళనకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టానికి పరిహారాన్ని నిందితుల నుంచి వసూలు చేయనున్నట్లు....

Published : 18 Aug 2020 02:21 IST

బెంగళూరు: కొద్దిరోజుల క్రితం బెంగళూరులో చోటుచేసుకున్న ఆందోళనకు సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టానికి పరిహారాన్ని నిందితుల నుంచి వసూలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ఇటీవల బెంగళూరులోని కేజీ హళ్లి, డీజే హళ్లి  ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆందోళనల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంభవించిన నష్టాన్ని అంచనా వేసి నిందితుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుప్రీం కోర్టు ఉత్తర్వులను అనుసరించి క్లెయిమ్‌ కమిషనర్‌ నియామకం కోసం హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని సమావేశం అనంతరం యడియూరప్ప ట్వీట్ చేశారు.

అలానే చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం (యుఏపీఏ)ను అమలు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో త్వరతగతిన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక న్యాయవాదులను నియమించనున్నట్లు తెలిపారు. గూండా చట్టం అమలుపై సిట్ సమాలోచనలు జరుపుతుందని, త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటామని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఒక మతాన్ని కించపరుస్తూ స్థానిక ఎమ్మెల్యే బంధువు ఒకరు పెట్టిన పోస్టింగ్‌తో వివాదం చెలరేగింది. దానిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన వారికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. వీటిని అదుపుచేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. అలానే ఆందోళకారుల దాడిలో 78 మంది పోలీసులు గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని