
ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నాం..
అధికారంలోకి వచ్చిన తొలిరోజే కొవిడ్‌పై చర్యలు
జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్
విల్మింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్‌పై 40 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్ అత్యధిక ఎలక్టోరల్ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు అత్యంత చేరువలో నిలిచారు. కీలక రాష్ట్రమైన జార్జియా, నెవడాలోనూ డెమొక్రాటిక్ నేత ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ఫలితాలపై శుక్రవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) జాతినుద్దేశించి మాట్లాడారు.
300 ఎలక్టోరల్ ఓట్లు మావే..
‘అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించట్లేదు. అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని తాజాగా వెలువడుతున్న ఫలితాలే చెబుతున్నాయి. 24 గంటల క్రితం వరకు జార్జియాలో వెనుకంజలో ఉన్న మేము ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నాం. పెన్సిల్వేనియాలో కూడా ముందంజలో ఉన్నాం. 24ఏళ్ల తర్వాత అరిజోనాలో, 28ఏళ్ల తర్వాత జార్జియాలో గెలుస్తున్న తొలి డెమొక్రాట్స్ మేమే. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ల చేతిలో ఓడిపోయిన చాలా రాష్ట్రాలు ఇప్పుడు నీలవర్ణంలోకి మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధించబోతున్నాం. ట్రంప్‌పై 40లక్షల ఓట్లతో గెలుస్తున్నాం. 300కి పైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించబోతున్నాం’ అని బైడెన్ గెలుపుపై ధీమాగా ఉన్నారు.
మా ప్రణాళికలకు ప్రజల తీర్పు ఇది..
‘అన్ని ప్రాంతాలు, మతాలకు అతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నారని ఫలితాలతో స్పష్టమవుతోంది. కొవిడ్ వైరస్, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పు, జాతి విద్వేషం తదితర అంశాల్లో మేం ప్రకటించిన ప్రణాళికలకు ప్రజలిస్తున్న తీర్పు ఇది. కరోనా నివారణ, విద్వేషాన్ని అరికట్టేందుకు అనేక ప్రణాళికలు తయారుచేశాం. అవి ప్రజలకు చేరువయ్యేలా చూశాం. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మా ప్రణాళికలను అమల్లోకి తెస్తాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. క్లిష్ట సమస్య పరిష్కారానికే(కరోనాను ఉద్దేశిస్తూ) మా తొలి ప్రాధాన్యత’ అని బైడెన్ వెల్లడించారు.
సంయమనం పాటించండి..
‘ఇంతటి కఠినమైన ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు, ఆందోళనలు ఉంటాయని తెలుసు. అయితే ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలి. తప్పకుండా అందరి ఓట్లు లెక్కిస్తారు. రాజకీయాల్లో మనం ప్రత్యర్థులం కావొచ్చు. కానీ శత్రువులం కాదు కదా.. మనమంతా అమెరికన్లం’ అని రిపబ్లికన్ మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి..
కీలక రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి
వక్రమార్గంలో పీఠం ఎక్కాలనుకోవద్దు: ట్రంప్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.