Published : 18 Dec 2020 02:00 IST

రాష్ట్రాల అధికార పరిధిని ఆక్రమిస్తున్నారు

కోల్‌కతా: భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌ దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ గురువారం మరోసారి స్పందించింది. నడ్డా పర్యటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న ఆ ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల్ని తక్షణమే కేంద్ర విధులకు పంపాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ఐపీఎస్‌ కేడర్‌ నిబంధనల ప్రకారం.. రాష్ట్ర వ్యవహారాల్లో వివాదాలు తలెత్తినపుడు కేంద్రం జోక్యం చేసుకోవచ్చని పేర్కొంది. 

అయితే కేంద్ర హోంశాఖ తాజా ఆదేశాలపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పినప్పటికీ అధికారుల్ని డిప్యుటేషన్‌పై పంపమని ఆదేశించడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లతో కేంద్రంపై విరుచుకుపడ్డారు. 

‘కేంద్రం చేపడుతున్న ఈ చర్యలు రాష్ట్ర అధికార పరిధిని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా ఉన్నాయి. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులు నిరుత్సాహానికి గురవుతారు. ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యవహరించడమే. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య, పూర్తిగా ఆమోదయోగ్యం కానిది. రాష్ట్రాన్ని నియంత్రించడానికి కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నాల్ని మేం అనుమతించం. విస్తరణవాదులు, అప్రజాస్వామిక శక్తుల ముందు బెంగాల్‌ ఎప్పటికీ తలొగ్గదు’ అని మమతా విమర్శలు చేశారు. 

ఇటీవల బెంగాల్‌ పర్యటనకు వెళ్లిన భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ.. కేంద్ర హోంశాఖ ఆ ముగ్గుర్నీ డిప్యుటేషన్‌పై కేంద్ర విధులకు రమ్మని ఆదేశించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై బెంగాల్‌ ప్రభుత్వం అప్పుడు అభ్యంతరం తెలిపింది. కాగా ఆ ముగ్గురు అధికారుల్లో బోలనాథ్‌ పాండేను బీపీఆర్డీ ఎస్పీగా, ప్రవీన్‌ త్రిపాఠీని ఎస్‌ఎస్‌బీ డీఐజీగా, రాజీవ్‌ మిశ్రాను ఐటీబీపీ ఐజీగా నియమిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి

రైతులకు నిరసన తెలిపే హక్కుంది.. కానీ

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని