కరోనా నేపథ్యంలో..ఐరాస ప్రత్యేక భేటీ!

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రత్యేకంగా భేటీ అవుతోంది.

Published : 02 Dec 2020 20:54 IST

వర్చువల్‌ పద్ధతిలో ప్రసంగించనున్న వివిధ దేశాధినేతలు

న్యూయార్క్‌: గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ చవిచూడని సంక్షోభాన్ని ప్రపంచం కరోనా రూపంలో ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే, వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ తుది ప్రయోగాలు ముగిసి, అత్యవరసర వినియోగానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో ప్రపంచదేశాల అధినేతలు, ఐక్యరాజ్య సమితి ముఖ్య ప్రతినిధులతో పాటు వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. డిసెంబర్‌ 3, 4వ తేదీల్లో జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో కరోనా ప్రభావం, ఎదుర్కొంటున్న తీరు, వ్యాక్సిన్‌ వస్తోన్న నేపథ్యంలో వివిధ దేశాల సమన్వయంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.

ప్రసంగించనున్న సీరం చీఫ్‌..
ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశంలో భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా కూడా ప్రసంగించనున్నారు. అయితే, ముందుగానే రికార్డు చేసిన వీడియో ప్రసంగాన్ని సమావేశంలో వినిపించనున్నారు. సీరం, బయోఎన్‌టెక్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో పాటు వ్యాక్సిన్‌పై ఏర్పడ్డ ‘గావీ’ కూటమి సీఈఓ సెత్‌ బెర్క్లీ కూడా వర్చువల్‌గా జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఫైజర్‌, మోడెర్నా, స్పుత్నిక్‌తో పాటు ఆస్ట్రాజెనెకా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌లు 90శాతానికి పైగా సమర్థత కలిగినట్లు ప్రకటించాయి. ఇప్పటికే చైనా, రష్యా దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీలో నిమగ్నమయ్యాయి. ఇక ఫైజర్‌ అత్యవసర వినియోగానికి బ్రిటన్‌ కూడా అనుమతి ఇచ్చింది. అమెరికాలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇలా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో ప్రపంచదేశాల మధ్య సమన్వయం కోసం ఐక్యరాజ్య సమితి సాధారణ సభ భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది.

ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ముఖ్య ప్రతినిధులతో పాటు వివిధ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 141 మంది ప్రసంగించే అవకాశం ఉంది. వీరిలో 53 మంది వివిధ దేశాధినేతలు, 39 మంది ప్రభుత్వాధినేతలు, నలుగురు ఉప ప్రధానులు, 38 మంది మంత్రులు ప్రసంగ జాబితాలో ఉన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మాత్రం ఐక్యరాజ్య సమితి సాధారణ సభనుద్దేశించి ప్రసంగించడం లేదని తెలుస్తోంది. ఆయనకు బదులు అమెరికా ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఐరాసలో ఉన్న ఆరు ప్రధాన విభాగాల్లో సాధారణ సభ ఒకటి. ఐరాస సభ్యత్వం కలిగిన 193 దేశాలకూ ప్రాతినిధ్యం ఉన్న ఒకేఒక్క విభాగం కూడా ఇదే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని