కొవిడ్-19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు..!
కరోనా మూలాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం వచ్చే నెల చైనాలో పర్యటించనుంది.
వుహాన్ వాసులు ఏమంటున్నారంటే..!
వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మూలాలు చైనాలోని వుహాన్‌లో ఉన్నాయని యావత్ ప్రపంచం భావిస్తోన్న విషయం తెలిసిందే. వీటిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం వచ్చే నెల చైనాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వుహాన్ స్పందించింది. ఈ దర్యాప్తునకు మేం భయపడుటలేదంటోన్న వుహాన్ వాసులు..దర్యాప్తు ద్వారా వైరస్ ఇక్కడ ఉద్భవించలేదనే విషయం నిరూపితమవుతుందని ఆశిస్తున్నారు. ‘డబ్ల్యూహెచ్‌ఓ బృందం రావడాన్ని స్వాగతిస్తున్నాం. వైరస్ ఎలా అభివృద్ధి చెందిందో మేము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ వైరస్ ఇక్కడే బయటపడిందని తెలిస్తే..అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే వీలుంటుంది’ అని వుహాన్‌కు చెందిన ఓ పౌరుడు వార్తా ఏజెన్సీతో పేర్కొన్నాడు. అయితే, ఆ మార్కెట్ నుంచే వచ్చిందని మాత్రం నమ్మడం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ దర్యాప్తునకు మేము భయపడటం లేదని..ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు సవ్యంగానే ఉన్నట్లు మరో స్థానిక వ్యాపారి పేర్కొన్నాడు. జనవరి నెలలో అంతర్జాతీయ బృందం చైనాలో కొవిడ్ మూలాలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వుహాన్ వాసులు ఇలా స్పందిస్తున్నారు.
వ్యతిరేకిస్తోన్న చైనా..
కరోనా వైరస్ మహమ్మారి వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార మార్కెట్‌లో తొలుత బయటపడ్డట్లు భావిస్తున్న విషయం తెలిసిదే. అక్కడి నుంచి అనతికాలంలోనే యావత్ ప్రపంచానికి వ్యాపించిన వైరస్, ఇప్పటికే లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అయితే, వైరస్ మూలాలపై చైనా తొలుత మౌనంగానే ఉన్నప్పటికీ.. తర్వాత ఖండిస్తూ వస్తోంది. ఇతర దేశాల నుంచే చైనాకు వైరస్ వచ్చిందనే కొత్త వాదనను మొదలు పెట్టింది. ఈ సమయంలో వైరస్ మూలాలపై అంతర్జాతీయ స్వతంత్ర బృందం దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. కరోనా వైరస్ మూలాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపడాన్ని మాత్రం తొలుత చైనా వ్యతిరేకించింది. చివరకు డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో జరిగే దర్యాప్తునకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో కరోనా మూలాలను కనుగొనేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం జనవరిలో చైనాలో పర్యటించనున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా ప్రకటించింది.
వుహాన్ పర్యటనపై మౌనం..
తమ దర్యాప్తు బృందం వుహాన్‌లో పర్యటిస్తుందా? లేదా? అనే విషయాన్ని మాత్రం డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించలేదు. వీటిపై ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని మాత్రం పేర్కొంది. ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జులై నెలలోనే చైనాలో పర్యటించిన WHO ద్విసభ్య బృందం కూడా వుహాన్‌ను సందర్శించలేదు. అయితే, డబ్ల్యూహెచ్‌ఓ తాజా ప్రకటనపై చైనా నేరుగా స్పందించలేదు. రోజువారీ మీడియా సమావేశంలో మాత్రం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆచితూచి స్పందించింది. డబ్ల్యూహెచ్‌ఓ చేస్తోన్న ప్రయత్నాలకు పూర్తి సహకారం అందించడంతో పాటు కొవిడ్‌పై తమ దేశం సాధించిన విజయాన్ని వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు.
మిస్టరీగానే కరోనా మూలాలు..
కరోనా వైరస్ బయటపడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఆ వైరస్ మూలాలపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దీనిపై స్వతంత్ర బృంద దర్యాప్తు జరపాలని నిర్ణయించినప్పటికీ అనుమతులు ఇవ్వడంలో చైనా ఆలస్యం చేస్తోంది. తాజాగా దీనికి అంగీకరించడంతో WHO దర్యాప్తు బృందం జనవరిలో చైనాలో పర్యటించనుంది. ఇదిలాఉంటే, కరోనా వైరస్ బయటపడిన తొలినాళ్లలో.. వుహాన్ మార్కెట్లో వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు ముందుగానే గుర్తించిన చైనా.. అక్కడి మార్కెట్లను మూసివేసింది. దాదాపు 76రోజుల పాటు నగరం మొత్తం కఠిన లాక్‌డౌన్ అమలుచేసింది. ప్రస్తుతం వుహాన్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కరోనాకు కారణంగా భావిస్తోన్న సముద్రపు ఆహార కేంద్రాలను మాత్రం తెరవలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కరోనా మూలాలపై చైనా పారదర్శకంగా లేదనే వాదన ఉంది.
ఇవీ చదవండి..
చైనా వ్యాక్సిన్: సమర్థతపైనా గోప్యతే!
కొవిడ్ వ్యాక్సిన్‌కు అక్కడ మిశ్రమ స్పందనే..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు