ప్రధాని మౌనం దేశ ఆడపడుచులకు అపాయం

హాథ్రస్‌ ఘటనపై ప్రధాని మోదీ నోరు విప్పాలని భీమ్‌ ఆర్మీ చీఫ్‌..

Published : 03 Oct 2020 01:21 IST

హాథ్రస్‌ ఘటనపై స్పందించాలని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ డిమాండ్

దిల్లీ: దేశాన్ని కుదిపేసిన హాథ్రస్‌ ఘటనపై ప్రధాని మోదీ నోరు విప్పాలని భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దళిత యువతి అత్యాచారానికి గురై అనంతరం గాయాలతో మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువతి మరణించిన రోజు ఆమె చికిత్స పొందిన దిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆసుపత్రి ముందు భీమ్‌ ఆర్మీ ధర్నా నిర్వహించింది. తాజాగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ ఘటనపై స్పందిచాలన్నారు. ప్రధాని మౌనం దేశ ఆడపడుచులకు అపాయకరమన్నారు.

‘ప్రధాని ఉత్తరప్రదేశ్ నుంచే ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆ రాష్ట్రంలో దేశం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఓ కూతురిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. చెత్తను కాల్చినట్లు పోలీసులు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రధాని నోరు మెదపాల్సిన అవసరం లేదా?’ అని ఆజాద్‌ ప్రశ్నించారు. ‘యువతి అరుపులు, ఆమె కుటుంబసభ్యుల రోధన ప్రధానికి వినిపించలేదా?ఇంకెన్నాళ్లు మౌనంగా ఉంటారు? సమాధానం చెప్పితీరాలి. ప్రధాని సమాధనం కోరుతూ ఈరోజు సాయంత్రం ఇండియా గేట్‌ వద్దకు వస్తున్నాం. ఆయన మౌనం మా ఆడబిడ్డలకు ప్రమాదకరం’ అని అన్నారు. ఇండియా గేట్‌ వద్ద ఈరోజు సాయంత్రం నిరసన చేపట్టేందుకు ఆజాద్‌ పిలుపునిచ్చారు. అయితే ఆయన పిలుపునిచ్చిన కొద్దిసేపటికే దిల్లీ పోలీసులు ఇండియా గేట్‌ వద్ద ఆంక్షలు విధించారు. దీంతో జంతర్‌మంతర్‌లో నిరసన చేపట్టేందుకు ఆజాద్‌ నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని