మెదడును చదివే పరికరం వచ్చేసింది!

శరీరంలో ప్రతి అవయవ పని తీరును తెలుసుకునేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మానవ హృదయం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో లైవ్‌లో ఓ కంప్యూటర్‌ తెరమీదనే చూసే సాంకేతికతను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం గుండె మాత్రమే కాదు ఊపిరిత్తులు...

Published : 18 Jun 2021 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్: శరీరంలో ప్రతి అవయవ పని తీరును తెలుసుకునేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మానవ హృదయం రక్తాన్ని ఎలా పంపు చేస్తుందో లైవ్‌లో ఓ కంప్యూటర్‌ తెరమీదనే చూసే సాంకేతికతను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కేవలం గుండె మాత్రమే కాదు ఊపిరిత్తులు, కాలేయం, మూత్రపిండాలు ఇలా అన్ని అవయవాల పని తీరును నిర్ధిష్టంగా అంచనా వేయవచ్చు. కానీ, మానవ మెదడు ఎలా పని చేస్తుంది? ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాడీ కణాలు ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.  మరి కొన్ని రోజుల్లో అది కూడా సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన  ‘కెర్నల్‌’ అనే అంకుర సంస్థ దీని కోసం ప్రత్యేకంగా హెల్మెట్‌ లాంటి రెండు పరికరాలను అభివృద్ధి చేసింది. దీని ద్వారా మెదడు పని తీరును తెలుసుకునే వీలుంటుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ తాజాగా తాము రూపొందించిన హెల్మెట్‌లను పదుల సంఖ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది.వీటి విలువ 50 వేల డాలర్లు. అయితే మెదడును చదివే టెక్నాలజీ ఇప్పటికే కొంతవరకు అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో మెదడును పని తీరును తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ యంత్రాలు భారీ పరిమాణంలో పెద్ద మొత్తంలో స్థలాన్ని ఆక్రమిస్తాయి. అంతేకాకుండా ఎవరి మెదడును పరీక్షించాలనుకున్నారో ఆ వ్యక్తి ఆ గదిలోనే ఉండాల్సి ఉంటుంది. కానీ,  అభివృద్ధి చేసిన పరికరం మాత్రం హెల్మెట్‌ పరిమాణంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడకు కావాలంటే అక్కడికి దీనిని తీసుకెళ్లే వెసులుబాటు ఉంటుంది.

కెర్నల్‌ అభివృద్ధి చేసిన పరికరాల్లో రెండు రకాలున్నాయి. 1. ఫ్లో  2. ఫ్లక్స్‌. ఫ్లో - బ్రెయిన్‌ ఇంటర్ఫేస్‌ ద్వారా మెదడు రియల్‌ టైం డేటాను రికార్డు చేయవచ్చు. అంతేకాకుండా దానికి అమర్చిన లేజర్‌ పరికరాల ద్వారా మెదడు కార్యకలాపాలను కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంటుంది. హెల్మెట్‌కు అమర్చిన యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసినట్లయితే మెదడు పని తీరును తెరపై వీక్షించవచ్చు.

ఫ్లక్స్‌ హెల్మెట్‌ ద్వారా మెదడులోని నాడీకణాల (న్యూరాన్లు) వేగాన్ని పరిశీలించవచ్చు. ఏ పని చేస్తున్నప్పుడు న్యూరాన్లు ఎలా ప్రతిస్పందిస్తు్న్నాయో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు సంతోషంగా ఉన్నప్పుడు, బాధ సమయంలోనూ, కోపం వచ్చినప్పుడు ఇలా వివిధ సందర్భర్లాల్లో నూరాన్లు ఎలా స్పందిస్తున్నాయో, దానికి అనుగుణంగా మెదడు ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకునే వీలుంటుంది.అయితే ఈ రెండు హెల్మెట్లు కలిపి 50 వేల డాలర్లా? లేదా ఒక్కో హెల్మెట్‌ ధర 50 వేల డాలర్లా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఎలా పని చేస్తుంది?

హెల్మెట్‌ లాంటి పరికరాన్ని వ్యక్తి తలకు అమరుస్తారు. హెల్మెట్‌లోని లేజర్‌ కిరణాలు పుర్రె ద్వారా మెదడులోకి ప్రవేశిస్తాయి. మెదడులో కోట్ల సంఖ్యలో న్యూరాన్లు ఉంటాయి. మనకు ఎలాంటి భావోద్వేగం కలిగినా ఇవి ప్రతిస్పందిస్తాయి. అంతేకాకుండా మన ఆలోచనల్నింటికీ ఇవే మూలం. అందువల్ల మెదడులోకి ప్రవేశించిన లేజర్‌ కిరణాలు న్యూరాన్ల పని తీరును పసిగట్టి ఆ ప్రక్రియను రికార్డు చేస్తాయి.  ‘మాగ్నెటోఎన్స్‌ఫలోగ్రఫీ’ ద్వారా మెదడు పని తీరును చిత్రీకరిస్తాయి. ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రతిస్పందిస్తున్నామో ఇవి తెలుసుకుంటాయి.ఫ్లో హెల్మెట్‌ పరికరం ద్వారా రక్తంలోని ఆక్సిజన్‌స్థాయిలను కూడా తెలుసుకోవచ్చు. తొలుత వీటిని మెదడుపై పరిశోధన చేసే సంస్థలకు పంపిణీ చేయనున్నారు. ఎవరైనా ప్రవేటు వ్యక్తులు ఆసక్తి ఉంటే కొనుగోలుచేయవచ్చని కెర్నల్‌  సంస్థ సీఈవో జాన్సన్‌ వెల్లడించారు. 

నష్టమూ ఉంటుందా?

కెర్నల్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఈ పరికరాల వల్ల నష్టమూ ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, తమ సిబ్బందితో వీటిని ధరింపజేసి వారి మనసులో ఏముందో తెలుసుకునే వీలుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ పరికరాలను సక్రమ మార్గంలో ఉపయోగిస్తే ఎంతో మేలుంటుందని కెర్నల్‌ యాజమాన్యం చెబుతోంది. ముఖ్యంగా మానసిక రోగుల స్థితిని అంచనా వేసి వారిని మామూలు మనుషులుగా చేసేందుకు దీనిని ఉపయోగించుకోవచ్చని చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు