Bomb Threat: భారత గగనతలంలో.. ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు..!

భారత గగనతలంలో ప్రవేశించిన సమయంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.

Updated : 03 Oct 2022 13:24 IST

దిల్లీ: భారత గగనతలంలో ప్రవేశించిన సమయంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ ప్రయాణికుల విమానం దిల్లీకి సమీపాన ఉన్న వేళ.. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో అధికారులు వెంటనే అప్రమత్తమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్‌ ప్రకారం.. ఇరాన్‌లోని టెహ్రాన్‌ నుంచి IRM081 విమానం చైనాలోని జువాంగ్జౌకు బయలుదేరింది. భారత గగనతంలోకి ప్రవేశించిన సమయంలో.. ఈ ఉదయం దానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు పైలట్ అనుమతి కోరారు. అయితే సాంకేతిక కారణాలతో అధికారులు దానిని జైపుర్ వైపు మళ్లించారు. పైలట్ విమాన ల్యాండింగ్‌కు నిరాకరించి, భారత గగనతలం వదిలి, తన ప్రయాణాన్ని కొనసాగించారని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు ఫైటర్ జెట్లను కూడా రంగంలోకి దింపినట్లు చెప్పింది. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం.. అది ఇప్పుడు చైనా గగనతలంలోకి ప్రవేశించినట్లుు తెలుస్తోంది. ఈ ఉదయం బాంబు బెదిరింపు రాగానే, దిల్లీ విమానాశ్రయంలోని అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని