Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు..!

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రాణహాని తలపెడతామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Updated : 25 Apr 2023 15:15 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)కు ప్రాణహాని చేస్తామంటూ బెదిరింపులు రావడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపులు ‘112’ నంబరుకు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ నంబరును ఆ రాష్ట్ర పోలీసు విభాగం అత్యవసర సర్వీసులకు వినియోగిస్తోంది. దుండగుడు ఈ నంబరుకు కాల్‌ చేసి త్వరలో సీఎంని హత్య చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపుతో 112 ఆపరేషన్‌ కమాండర్‌ సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రిహాన్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

రాష్ట్రంలో యోగి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపారు. 2017 నుంచి ఇప్పటి వరకు 178 మంది క్రిమినల్స్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ కుమారుడు అసద్‌ను ఇటీవల ఝాన్సీ వద్ద ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోపే దాదాపు 100కు పైగా కేసుల్లో నిందితులైన అతీక్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ హత్యకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎంకు హత్యాయత్నం బెదిరింపులు రావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ (Narendra Modi) కేరళ పర్యటన సమయంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కేరళ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. జేవియర్‌ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. కొచ్చి కమిషనర్‌ సేతు రామన్‌ మాట్లాడుతూ..‘‘ప్రధానికి బెదిరింపు లేఖ పంపిన జేవియర్‌ను అరెస్టు చేశాం’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని