Deepfake: అంబానీ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌.. కేటుగాళ్ల వలలో డాక్టర్

స్టాక్‌ మార్కెట్ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో లాభం అంటూ ఆన్‌లైన్‌ మోసగాళ్లు విసిరిన వలలో ఒక డాక్టర్ చిక్కుకున్నారు. 

Updated : 21 Jun 2024 14:00 IST

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్ గురించి పెద్దగా పరిచయం లేకపోయినా.. అధిక రాబడి ఆశించి, దానిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అందుకు కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తున్నారు. డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలతో అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ తరహాలో భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ డీప్‌ఫేక్ కారణంగా ఓ వైద్యుడు మోసపోయారు.

మహారాష్ట్రలోని అంథేరీకి చెందిన డాక్టర్ పాటిల్‌కు ఇన్‌స్టాగ్రాం ఖాతా లక్ష్యంగా ఒక వీడియో దర్శనమిచ్చింది. రాజీవ్ శర్మ ట్రేడ్‌ గ్రూప్‌, దానికి చెందిన బీఎస్‌ఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీలో పెట్టుబడులు పెడితే భారీ రిటర్న్స్‌ వస్తాయని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఆ సంస్థ గురించి వెతికితే ముంబయి, లండన్‌లో దాని కార్యాలయాలు ఉన్నట్లు ఆయనకు కనిపించింది. దాని గురించి ముకేశ్‌ అంబానీయే ప్రచారం చేసినట్టుగా ఉండటంతో ఆయన కేటుగాళ్ల కుట్రలో చిక్కారు.

Deep fake: డీప్‌ఫేక్‌.. గుడ్‌.. బ్యాడ్‌.. అగ్లీ!

దాంతో ఆయన ఏడు లక్షల రూపాయాలను 16 బ్యాంక్ ఖాతాలకు పంపించారు. చెప్పినట్టుగానే ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో భారీ లాభాలు కనిపించాయి. దాంతో ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా..సాధ్యం కాలేదు. అప్పటికిగానీ తాను మోసపోయానన్న విషయం పాటిల్‌కు అర్థం కాలేదు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. అప్పుడే మోసగాళ్లు డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడారని బయటపడింది. సదరు ఖాతాల అక్రమ లావాదేవీలను బ్లాక్‌ చేసేలా బ్యాంకులకు పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ఫేక్‌ (Deepfake) వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్‌ తెందూల్కర్ ప్రచారం చేస్తున్నట్టుగా గతంలో ఒక వీడియో వైరల్‌ అయింది. ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) కూడా వాటి బారినపడ్డారు. ట్రేడింగ్ యాప్‌లకు ఆయన ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొట్టాయి. డీప్‌ఫేక్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది. ఈ నకిలీ వీడియోల వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని