కోటిన్నర పెట్టి కట్టుకున్న ఇల్లు కూలగొట్టాల్సి వస్తే.. రైతు ఏం చేశాడంటే?

కూడబెట్టిన సొమ్ముతో తన కలల సౌధం నిర్మించుకున్నాడో రైతు. అందుకోసం కోటిన్నర రూపాయల వరకు వెచ్చించాడు

Published : 20 Aug 2022 17:40 IST

సంగ్రూర్‌: కూడబెట్టిన సొమ్ముతో తన కలల సౌధం నిర్మించుకున్నాడో రైతు. అందుకోసం కోటిన్నర రూపాయల వరకు వెచ్చించాడు. తన పొలంలో నచ్చినట్టుగా దానిని తీర్చిదిద్దుకున్నాడు. అంతా బావుంది అనుకునేలోపే.. ఆ ఇంటిని కూల్చే పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఏం జరిగింది..? అప్పుడు ఆ రైతు ఏం చేశాడు..?

పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన సుఖ్‌విందర్ సింగ్ సుఖి ఓ రైతు. రోషన్‌వాలా గ్రామంలో తన పంట పొలంలో తనకు నచ్చిన రీతిలో రెండంతస్తుల కలల సౌధం నిర్మించుకున్నారు. అందుకోసం రూ.1.5 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. ఈ పొలాలు ఉన్న ప్రాంతం మీదుగా భారత్‌మాల ప్రాజెక్టు కింద కేంద్రం ఎక్స్‌ప్రెస్‌వేను ప్రకటించింది. హరియాణా, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాలను కలుపుతూ, వాటి మధ్య దూరాన్ని తగ్గించమే ఈ ఎక్స్‌ప్రెస్‌వే లక్ష్యం. ఇది కాస్తా సుఖ్‌విందర్ ఇంటికి ఎసరు తెచ్చింది. అడ్డుగా ఉన్న నిర్మాణాన్ని తొలగించమని, పరిహారం చెల్లిస్తామని పంజాబ్‌ ప్రభుత్వం ఆ రైతుకు సూచించింది. కానీ ఎంతో నచ్చి కట్టుకున్న గూడును తన చేత్తో కూల్చడం ఇష్టం లేక.. ఓ ఉపాయం ఆలోచించారు. దానిని అక్కడి నుంచి తరలించడమే మార్గం అని భావించారు. అందుకోసం నిర్మాణ రంగ కార్మికులతో కలిసి కావాల్సిన ఏర్పాటు చేశారు. ఇంటికి చక్రాలు లాంటి వాటిని అమర్చి, పక్కకు కదిలించేలా సాంకేతికతను ఉపయోగించారు. దానికి సంబంధించి దృశ్యాలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ ఇల్లు 500 అడుగుల దూరంలో ఉండాలి. ఇప్పటివరకూ 250 అడుగుల మేర పక్కకు జరిపారు. 

‘నేను ఎంతో ఇష్టపడి ఈ ఇల్లు నిర్మించుకున్నాను. అందుకోసం రెండేళ్లు పట్టింది. కోటిన్నర రూపాయలు ఖర్చు అయింది. నేను ఇంకో ఇంటిని కట్టుకోవాలని అనుకోవట్లేదు’ అని ఆ రైతు వెల్లడించారు. ‘దిల్లీ-అమృత్‌సర్‌-కత్రా జాతీయ రహదారి.. ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. ఇది పూర్తయితే దిల్లీ నుంచి పంజాబ్ మీదుగా జమ్ముకశ్మీర్ ప్రయాణించేవారి డబ్బు, ఇంధన, సమయం ఆదా అవుతుంది’ అని గతంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని