Narendra Modi: 9 వైద్య కళాశాలలను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు......

Published : 25 Oct 2021 20:47 IST

సిద్ధార్థ్‌నగర్: దేశంలో పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని సోమవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు రూ.2,329 కోట్లతో నిర్మించిన 9 వైద్య కళాశాలలను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. సిద్ధార్థ్‌నగర్ నుంచి వర్చువల్‌గా ఆ కళాశాలలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు.

2014కు ముందు దేశంలో వైద్య కళాశాలల్లో సీట్లు 90వేల కంటే తక్కువే ఉన్నాయని పేర్కొన్న మోదీ.. ఈ ఏడేళ్లలో 60వేల సీట్లను కొత్తగా తమ ప్రభుత్వం జోడించిందన్నారు. 2017 వరకు యూపీలోని ప్రభుత్వ వైద్య కళాశాల్లో 1900 సీట్లు మాత్రమే ఉంటే.. భాజపా ప్రభుత్వం నాలుగేళ్లలో అదనంగా మరిన్ని సీట్లను పెంచిందని వెల్లడించారు. ఈ 9 వైద్య కళాశాలలు రాష్ట్రానికి బహుమతి అని పేర్కొన్నారు. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం యూపీలో ఉన్నందుకే ఇక్కడ ఆరోగ్య వసతులు మెరుగుపడ్డాయని మోదీ తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ ప్రారంభం

వైద్యరంగంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు దిశగా ప్రధాని మోదీ సోమవారం యూపీలోని వారణాసిలో పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ను ప్రారంభించారు. కాగా ఇది దేశంలోని అతిపెద్ద పాన్‌-ఇండియా ఒకటిగా ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం, వాటిని మెరుగుపరచడం, హెల్త్‌ సెంటర్లలోని సిబ్బందిని నియమించడం ఈ విషన్‌ ముఖ్య ఉద్దేశం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని