Borewell: బోరుబావిలో రెండేళ్ల చిన్నారి.. మరో 50 అడుగులు లోతుకు జారిపోయి..!

బోరుబావి(Borewell)లో పడిపోయిన రెండేళ్ల చిన్నారిని బయటకు తీసేందుకు చేస్తోన్న ప్రయత్నాలు క్లిష్టంగా మారాయి. అక్కడి నేలను తవ్వుతున్నా కొద్దీ ఆ పాప మరింత కిందకు జారిపోతున్నట్లు తెలుస్తోంది. 

Published : 07 Jun 2023 14:34 IST

సెహోర్‌: రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావి(Borewell)లో పడిపోయింది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా(Madhya Pradesh's Sehore district)లో మంగళవారం ఈ ఘటన జరగ్గా.. బుధవారం ఆ చిన్నారి మరింత లోతుకు జారిపోయినట్లు అధికారులు తెలిపారు. 

సెహోర్ జిల్లా సమీపంలోని ముంగావలీ గ్రామంలో బయట ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. తనను బయటకు తీసేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అది రాతినేల కావడంతో ఆ చిన్నారిని కాపాడటం క్లిష్టంగా మారిందని జిల్లా కలెక్టర్ ఆశీశ్‌ తివారీ మీడియాకు వెల్లడించారు. ‘తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకుపోయింది. ఆ తర్వాత మరో 50 అడుగుల లోతుకు జారిపోయింది. మేం తవ్వుతున్నా కొద్దీ ఆ పాప కిందికి జారిపోతోంది. తనకు ఆక్సిజన్ అందిస్తున్నాం. అది రాతి నేల కావడంతో ఈ సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. సాధ్యమైనంత త్వరగా ఆ చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని వెల్లడించారు. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ఆ పాపను సురక్షితంగా వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం పనిచేస్తోందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని