Varun Gandhi: బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణ.. వరుణ్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

వ్యవసాయ చట్టాలు, లఖింపుర్‌ ఖేరి ఘటన.. ఇలా ఆయా అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తోన్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. తాజాగా ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేవలం బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణతో అయిదు లక్షల ఉద్యోగులు బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది...

Published : 22 Feb 2022 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యవసాయ చట్టాలు, లఖింపుర్‌ ఖేరి ఘటన.. ఇలా ఆయా అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వస్తోన్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ.. తాజాగా ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియతో ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేవలం బ్యాంకులు, రైల్వేల ప్రైవేటీకరణతో అయిదు లక్షల ఉద్యోగులు బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. దీంతో వారు నిరుద్యోగులుగా మారతారు. లక్షలాది కుటుంబాల ఆశలూ గల్లంతవుతాయి. సామాజిక స్థాయిలో ఆర్థిక అసమానతలను సృష్టించడం ద్వారా ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వం.. పెట్టుబడిదారీ విధానాన్ని ఎప్పటికీ ప్రోత్సహించలేదు’ అని ట్వీట్‌ చేశారు.

గతంలో.. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీతోసహా పలువురు ప్రతిపక్ష నేతలు రైల్వే రంగంలో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల లోక్‌సభలో స్పష్టతనిచ్చారు. కానీ, రైల్వే భూములు, ఇతర ఆస్తులు.. స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమం కింద ప్రైవేటు వ్యక్తులకు లీజుగా బదిలీ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్టు గతేడాది ప్రభుత్వం చేసిన ప్రకటనపై కూడా భారీ ఎత్తున నిరసనలు జరిగాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని