ఊబకాయులను అద్దెకిస్తారట!

జపాన్‌లో వ్యక్తుల్ని అద్దెకివ్వడం కొత్తేమి కాదు.. ఓదార్పునివ్వడానికి, కాసేపు బాయ్‌ఫ్రెండ్‌/గర్ల్‌ఫ్రెండ్‌గా నటించడానికి, ఒకరికి తమ బదులు క్షమాపణ కోరడానికి ఇలా అనేక పనులకు అక్కడ అద్దెకు మనుషులు దొరుకుతారు. ఇలాంటి ప్రతి సర్వీసుల్లోనూ అందంగా, ఆకర్షణీయంగా ఉండేవారికే డిమాండ్‌

Published : 12 Jun 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌లో వ్యక్తుల్ని అద్దెకివ్వడం కొత్తేమీ కాదు.. ఓదార్పునివ్వడానికి, కాసేపు బాయ్‌ఫ్రెండ్‌/గర్ల్‌ఫ్రెండ్‌గా నటించడానికి, ఒకరికి తమ బదులు క్షమాపణ కోరడానికి ఇలా అనేక పనులకు అక్కడ అద్దెకు మనుషులు దొరుకుతారు. ఇలాంటి ప్రతి సర్వీసుల్లోనూ అందంగా, ఆకర్షణీయంగా ఉండే వారికే డిమాండ్‌ ఉంటుంది. కానీ, ఇటీవల లావుగా ఉండే వారిని కూడా అద్దెకు ఇచ్చేందుకు ఓ సంస్థ ఏర్పాటైంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ సంస్థలో ఉద్యోగులుగా మారిపోయారు. ఇంతకీ లావుగా ఉండేవాళ్లను అద్దెకు తీసుకొని ఏం చేస్తారు? అనేగా మీ సందేహం.. అయితే ఇది చదివేయండి..

జపాన్‌కు చెందిన బ్లిస్‌ అనే వ్యక్తి లావుగా ఉండే వారి కోసం ‘క్యూ జిల్లా’ పేరుతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ను ప్రారంభించాడు. బ్రాండ్‌ ప్రకటనల కోసం లావుగా ఉండే మోడల్స్‌ను వెతికితే ఎవరూ దొరకలేదట. దీంతో తనకు లావుగా ఉండే మోడల్స్‌ కావాలని ఓ ప్రకటన ఇచ్చాడు. దీంతో తన కస్టమర్లలోనే చాలా మంది మోడలింగ్ చేస్తామని ముందుకొచ్చారు. దీంతో 2017లో ఊబకాయులకు టాలెంట్‌ హంట్‌ పేరుతో కార్యక్రమం నిర్వహించాడు. టాలెంట్‌ ఉన్నవాళ్లకు మోడల్స్‌గా అవకాశమిచ్చాడు. అయితే, కొన్నాళ్లకు అతడికో వినూత్న ఆలోచన వచ్చింది. ఊబకాయుల్ని అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. అలా ప్రారంభమైందే ‘దెబుకారీ’ సంస్థ. 

ఎవరైనా కాస్త లావుగా ఉంటే.. ఎంతో బాధపడిపోతుంటారు. అదే తన కంటే లావుగా ఉన్నవాళ్లు పక్కన ఉంటే కాస్త సన్నగా కనిపిస్తారట. అదే పాలసీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఎవరైనా కాస్త లావుగా ఉన్నవాళ్లు ఏ పార్టీకో, మీటింగ్‌కో వెళ్లినప్పుడు వారి వెంట ఈ ఊబకాయుల్ని తీసుకెళ్తే కాస్త సన్నగా కనిపిస్తారు. దీంతో లావుగా ఉన్నాననే ఆత్మన్యూనత పోయి ధైర్యం వస్తుందట. అలాగే, ఎవరైనా లావుగా ఉండే స్నేహితులు/సన్నిహితులకు దుస్తులు కొనాలంటే ఈ అద్దె ఊబకాయుల్ని వెంట తీసుకెళ్లి షాపింగ్‌ చేయొచ్చు. శరీర బరువు తగ్గించే ఫిట్‌నెస్‌ సంస్థలు, డైట్‌ ప్లాన్‌ ఇచ్చే సంస్థలు వీరిని అద్దెకు తీసుకొని ప్రకటనలు రూపొందించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో అవసరాలను ఊహించే బ్లిస్‌ ఈ సంస్థను నెలకొల్పాడు. వీరి అద్దె గంటకు 2000 జపాన్‌ యెన్లు(రూ.1,315) ఉంటుందట. ఇప్పటికే కొందరు ఉద్యోగులుగా మారగా.. కొన్ని రోజుల కిందట దెబుకారీ సంస్థ మరో ప్రకటన విడుదల చేసింది. వంద కిలోలకు మించి బరువు ఉన్న అబ్బాయిలు/ అమ్మాయిలు తమ సంస్థలో ఉద్యోగులుగా చేరొచ్చని వెల్లడించింది. అద్దె పూర్తిగా ఉద్యోగికే వెళ్తుంది. కేవలం సంప్రదింపుల ఫీజు కింద కంపెనీలు/వ్యక్తుల నుంచి కొంత మొత్తం డబ్బును సంస్థ తీసుకుంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ టోక్యో, ఒసాకా, అయిచీ వంటి నగరాల్లో తమ సేవల్ని అందిస్తోంది. విడ్డూరంగా ఉంది కదా.. జపాన్‌లో అంతే మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు