Rahul Gandhi: జోడోయాత్రలో భద్రతా వైఫల్యం.. రాహుల్ వద్దకు దూసుకువచ్చి..!

జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) భద్రతా వలయంలోకి ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. అయితే పక్కనే ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి, ఆ వ్యక్తిని వెనక్కి లాగారు.  

Updated : 17 Jan 2023 17:05 IST

దిల్లీ: కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతోన్న భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో భద్రతా వైఫ్యలం చోటుచేసుకుంది. మంగళవారం పంజాబ్‌(Punjab)లోని హోషియార్‌పుర్‌లో కొనసాగుతోన్న ఈ యాత్రలో.. ఓ వ్యక్తి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వద్దకు దూసుకువచ్చాడు. ఒక్కసారిగా చొచ్చుకువచ్చిన అతడు రాహుల్‌ను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు అతడిని వెనక్కి లాక్కెళ్లారు. ఈ ఘటన రాహుల్ భద్రతపై మరోసారి చర్చకు తావిచ్చింది.

కొద్దినెలలుగా రాహుల్‌ నేతృత్వంలో నడుస్తోన్న జోడోయాత్రలో పలుమార్లు భద్రతాలోపాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయనకు భద్రతను పెంచాలని ఇదివరకే కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే హస్తం పార్టీ భయాలను కేంద్రం తోసిపుచ్చింది. 2020 నుంచి రాహులే స్వయంగా సుమారు 100 సార్లు భద్రతను ఉల్లంఘించారని వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. రాహుల్‌కు కేంద్రం ప్రస్తుతం జెడ్‌ ప్లస్ కవర్ అందిస్తోంది. దీనికింద ఆయనకు ఎనిమిది నుంచి తొమ్మిది మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. ఇక కొద్దిరోజుల్లో జోడోయాత్ర జమ్మూకశ్మీర్‌లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో ఈ యాత్ర సాగుతుండటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరోపక్క ఈ ఘటన అనంతరం జోడో యాత్ర యథావిధిగా జరుగుతోంది.

ఎలాంటి భద్రతా వైఫల్యం లేదు: రాహుల్‌

జోడో యాత్రలో భద్రతా వైఫ్యలం చోటుచేసుకుందన్న వార్తలపై రాహుల్ గాంధీ స్పందించారు. అలాంటిదేమీ లేదని తెలిపారు. ‘దానిని మీరు భద్రతా లోపం అని ఎందుకు పిలుస్తున్నారు? అది వైఫల్యం కాదు. అదొక అంతులేని ఉత్సాహం. సిబ్బంది అనుమతితోనే ఆ వ్యక్తి నా వద్దకు వచ్చాడు’ అని రాహుల్ వెల్లడించారు. సిబ్బంది అనుమతితోనే లోపలికి వచ్చిన అతడు.. రాహుల్ చూసిన ఆనందంలో ఆయన్ను హత్తుకోబోయాడని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని