ఆ తల్లి ఫోన్‌ కాల్‌.. 25 మందిని కాపాడింది

కుమారుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని పదేపదే ఫోన్‌చేసింది. ఆ తల్లి ఫోన్‌ కాల్స్‌ 25 మందిని కాపాడాయి....

Updated : 14 Feb 2021 11:57 IST

దేహ్రాదూన్‌: కుమారుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని పదేపదే ఫోన్‌చేసింది. ఆ తల్లి ఫోన్‌ కాల్‌‌ 25 మంది ప్రాణాలను కాపాడింది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఈ నెల 7వ తేదీన మంచు చరియలు విరిగిపడి జల ప్రళయం చోటుచేసుకుంది. తపోవన్‌ పవర్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా గల్లంతయ్యారు. మరికొందరు అదృష్టవశాత్తూ తప్పించుకొన్నారు. అందులో విపుల్‌ కైరేనీ బృందం కూడా ఒకటి.

విద్యుత్కేంద్రంలో ఓ భారీ వాహనానికి విపుల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన ఆదివారం సెలవుదినం కావడంతో ఆరోజు పనికి వెళితే రెట్టింపు కూలీ (రూ.600) వస్తుండటంతో ఉదయం 9 గంటలకు విధులకు వెళ్లాడు. విధులు నిర్వహిస్తుండగా అతడి తల్లి మాంగ్శ్రీదేవి పదేపదే ఫోన్‌ చేసింది. ఇలా కొన్ని ఫోన్‌కాల్స్‌ తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కుమారుడికి రానున్న ఉపద్రవం గురించి వివరించింది. కానీ ఆమె చెప్పిన విషయాన్ని మొదట ఆయన నమ్మలేదు. కానీ తల్లి పదేపదే ఫోన్‌ చేస్తూ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని కుమారుడిని కోరింది.

‘మా గ్రామం కొండ ప్రాంతంలో ఉంటుంది. నా తల్లి ఇంటి బయట పని చేస్తుండగా దౌలిగంగ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ముందుకొస్తున్నట్లు గుర్తించి నాకు ఫోన్‌ చేసింది. కానీ నేను ఆ విషయాన్ని మొదట నమ్మలేదు. ఆమె పదేపదే ఫోన్‌ చేయడంతో నేను, నాతోపాటు మరో 24 మంది విద్యుత్కేంద్రంలోని ఎత్తయిన ప్రాంతంలో ఉన్న మెట్లపైకి చేరుకొని మా ప్రాణాలను కాపాడుకున్నాం. నా తల్లి ఫోన్‌ చేయకపోయుంటే నేను, నాతోటివారు మృతిచెంది ఉండేవాళ్లం’ అని విపుల్‌ కైరేనీ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన మిగతావారు ఆ తల్లికి ఎల్లవేళలా రుణపడిఉంటామని కృతజ్ఞత తెలిపారు.

ఇవీ చదవండి...

ఉత్తరాఖండ్‌: కలవరపెడుతున్న ‘డేంజర్‌ లేక్‌’!

సార్‌.. మా అబ్బాయి వేలైనా ఇవ్వాడి!
 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts