విమానంలో మహిళా సిబ్బందికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్‌

విమాన ప్రయాణంలో ఓ వ్యక్తి మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో విమానం దిగిన వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 15 May 2023 23:49 IST

దిల్లీ: దుబాయ్‌ నుంచి అమృత్‌సర్‌ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తప్పతాగి మహిళా సిబ్బందిని వేధింపులకు గురిచేశాడు. విమాన సిబ్బంది ఫిర్యాదుతో విమానం దిగిన వెంటనే అతడిని పోలీసులు అమృత్‌సర్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం దుబాయ్‌ నుంచి అమృత్‌సర్‌కు ప్రయాణిస్తున్న విమానంలో రాజిందర్‌ సింగ్‌ అనే వ్యక్తి తప్పతాగి మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో విమానంలోని సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానం ల్యాండ్‌ అయ్యాక ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో విమానం  దిగిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

గత కొన్ని నెలలుగా విమాన ప్రయాణాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. మద్యం మత్తులో కొందరు ప్రయాణికులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఎయిరిండియా విమానంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. తప్పతాగి ఓ ప్రయాణికుడు మహిళపై మూత్ర విసర్జన చేయగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది జరిగిన పది రోజులకే తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మరో వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడిన ఘటన కూడా వివాదాస్పదమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విమానాల్లో మద్యం తాగడం నిషేధించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని