Updated : 12 Aug 2022 13:18 IST

Raksha Bandhan: శిలగా మారిన ఆ సోదరుడి వెనుక కథ తెలిస్తే.. కన్నీరు ఆగుతుందా..?

దిల్లీ: చిలిపి తగాదాలు, అలకల మధ్యలోనే అంతులేని అనురాగాన్ని పంచుకుంటారు తోబుట్టువులు. రక్షా బంధన్ రోజున తమ అనుబంధానికి గుర్తుగా సోదరి రాఖీ కడితే.. నీ కష్టసుఖాల్లో మేం అండగా ఉంటామని భరోసా ఇస్తారు అన్నదమ్ములు. ఇలాగే శత్రువుల నుంచి దేశాన్ని కాచే సైనిక సోదరుడికి రాఖీ కట్టింది ఓ మహిళ. కానీ.. అతడు మాత్రం ఆమెను చూసి నవ్వలేదు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేదు. కనీసం ఓ బహుమతి కూడా ఇవ్వలేదు. కళ్లెదుటే ఉన్న సోదరుడిలో చలనం లేకపోతే.. ఆ సోదరి మనసు తట్టుకోగలదా..?కన్నీరుపెట్టకుండా ఉండగలదా..? ఉలుకూపలుకూ లేక శిలగా మారిన ఆ సోదరుడి వెనుక కథ తెలిస్తే హృదయం ద్రవించకమానదు..! లింక్డిన్‌ వేదికగా వేదాంత్ బిర్లా అనే వ్యక్తి షేర్ చేసిన ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఆ చిత్రంలో సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా. దేశసేవలో ప్రాణాలు అర్పించిన కద్వాస్రా వీరత్వానికి గుర్తుగా రాజస్థాన్‌లో విగ్రహం ఏర్పాటు చేశారు. దానికే ఆ మహిళ రాఖీ కట్టి, కన్నీరు తెప్పించింది. ‘ఇలాంటి సన్నివేశాలే భారత్‌ను అసాధారణంగా మారుస్తాయి. సోదరుడిని కోల్పోయిన బాధ, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వం ఆమెను ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేనున్నాంటూ భరోసా ఇచ్చే ఆ సోదరుడి చేతికి రాఖీ కట్టలేక ఆమె మనసు అలజడికి గురైంది. తనను తాను నియంత్రించుకుని విగ్రహ రూపంలో నిలిచిన అతడి చేతికే రాఖీ కట్టింది. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా జాట్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించారు. 24-09-2017న జమ్మూకశ్మీర్‌లో విధి నిర్వహణలో అమరుడయ్యారు’ అంటూ వేదాంత్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది చదివిన నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశసేవ చేస్తోన్న సైనికులకు సలాం కొట్టారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని