Gujarat: మోదీ పిలిస్తేనే పార్టీలోకొచ్చా.. ఇప్పుడు టికెట్‌ ఇవ్వలేదు..!

గుజరాత్‌ ఎన్నికల వేళ తనకు టికెట్ దక్కకపోవడంపై మధుభాయ్‌ శ్రీవాస్తవ్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడేందుకు సుముఖంగా లేరు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 

Published : 15 Nov 2022 01:37 IST

అహ్మదాబాద్‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అసంతృప్తి సెగ మొదలైంది. మరోమారు టికెట్ దక్కలేదన్న కారణంతో భాజపా నేత ఒకరు స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వాఘోడియా సెగ్మెంట్‌కు చెందిన మధుభాయ్‌ శ్రీవాస్తవ్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్థానికంగా బలమైన నేతగా పేరుంది. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ఈయన పేరు కూడా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను మోదీ, అమిత్‌ షా పిలుపు మేరకే భాజపాలో చేరినట్లు చెప్పారు. టికెట్ల విషయం దిల్లీలోని అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. 

‘నేను నా సొంతంగా భాజపాలో చేరలేదు. 1995లో నేను భారీ మెజార్టీతో గెలిచిన సమయంలో.. మోదీ, అమిత్‌ షా నన్ను భాజపాలో చేరమని కోరారు. అందుకే నేను ఆ పార్టీలో చేరాను. మా కుటుంబానికి చెందిన సభ్యులు కాంగ్రెస్, జేడీయూలో ఉన్నారు. ఈ టికెట్ గురించి నేను భూపేంద్ర పటేల్‌తో మాట్లాడలేదు. ఆ అవసరం లేదు. మోదీ, అమిత్‌షా నేరుగా మాట్లాడే అవకాశం నాకుంది’ అని వెల్లడించారు. అయితే తనకు టికెట్‌ దక్కకపోవడంపై ఇప్పటికైతే ఆయన వారితో మాట్లాడలేదు. ఈ వ్యాఖ్యలపై భాజపా స్పందించలేదు. ప్రస్తుత ఎన్నికల వేళ.. ఆయనతో కలిపి ఆరుగురు నేతలు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో భాజపా 160 మందికి టికెట్లు ఇచ్చింది. 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెట్టింది. వారిలో ఐదుగురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నారు. ఇక, 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు డిసెంబర్‌ ఒకటి, ఐదు తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితం వెల్లడికానుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు