Ropeway Accident: సహాయక చర్యల్లో అపశృతి.. హెలికాప్టర్‌ నుంచి కిందపడి వ్యక్తి మృతి

రోప్‌ వే కేబుల్ కార్ల ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది.......

Published : 12 Apr 2022 01:24 IST

దేవ్‌ధర్: ఝార్ఘండ్‌లోని దేవ్‌ధర్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్‌ వే కేబుల్ కార్లు ఆదివారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రమాదం అనంతరం సోమవారం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళ సిబ్బంది ఓ వ్యక్తిని రక్షించే క్రమంలో అతడు హెలికాప్టర్‌ నుంచి కిందపడి మృతిచెందాడు.

వైమానిక దళానికి చెందిన రెండు Mi-17 హెలికాఫ్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని కాపాడేందుకు రక్షణ బలగాలు యత్నించాయి. గాల్లో ఉన్న హెలికాప్టర్‌ వద్దకు తాడు సాయంతో చేరుకోగలిగిన సదరు వ్యక్తి.. కాక్‌పిట్‌ వద్దే వేలాడుతూ కనిపించాడు. కింద ఉండి ఇదంతా చూస్తున్న కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. అతడు క్షేమంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు. అయితే అతడిని హెలికాప్టర్‌ లోపలికి లాక్కునేందుకు సైన్యం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాసేపటికే పట్టుతప్పి కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడు కిందపడిపోతుండగా.. ఆ దృశ్యాలను చూస్తున్నవారి హాహాకారాలు వీడియోలో వినిపించాయి. మృతిచెందిన వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌ వాసిగా గుర్తించినట్లు తెలుస్తోంది.

దేవ్‌ధర్‌లోని బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వచ్చే ప్రజలు.. 20 కిలోమీటర్ల దూరంలోని త్రికూట పర్వతాల్లోని రోప్‌ వే వద్ద పర్యటిస్తుంటారు. అయితే ఆదివారం ఆ రోప్‌ వే ద్వారా నడిచే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు మరణించారు. దాదాపు 50 మంది అనేక గంటలపాటు రోప్‌ వే క్యాబిన్లలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ త్రికూట్ రోప్‌వే భారత్‌లోనే ఎత్తయిన వర్టికల్ రోప్‌ వే. ఇది 766 మీటర్ల పొడువు ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని