Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు

Kota Student's Suicide: రాజస్థాన్‌లో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. స్థానిక యంత్రాంగం, హాస్టల్ నిర్వాహకులు కలిసి చర్యలు తీసుకుంటున్నా సరే.. బలవన్మరణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

Published : 28 Sep 2023 16:12 IST

కోటా: రాజస్థాన్‌(Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. తాజాగా మరో మరణం వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య  చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. (Kota Student's Suicide)

ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన విద్యార్థి కోటాలో సొంతంగానే నీట్ కోసం సిద్ధం అవుతున్నారని తెలిపారు. వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఏటా వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థులు ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా యూపీ విద్యార్థి మరణంతో ఆ సంఖ్య 26కు చేరింది.

మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్‌ అధికారికి పిలుపు..

ఇదిలా ఉంటే.. ఈ బలవన్మరణాలను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో  రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని స్థానిక యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

ఇంకోవైపు వసతి గృహాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ కాయిల్‌ ఫ్యాన్లు అమర్చుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి వసతి గృహాల యజమానులు ఈ చర్యలు తీసుకొంటున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని