Vehicle Theft: దేశ రాజధానిలో.. ప్రతి 12 నిమిషాలకో వాహనం చోరీ..!

దేశంలో చోటుచేసుకుంటున్న వాహన దొంగతనాల జాబితాలో దేశ రాజధాని దిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 18 Oct 2022 01:27 IST

దిల్లీ: దేశంలో చోటుచేసుకుంటున్న వాహన దొంగతనాల (Vehicle theft) జాబితాలో దేశ రాజధాని దిల్లీ అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగే వాహన చోరీల్లో 56శాతం దిల్లీలోనే జరుగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అక్కడ ప్రతి 12నిమిషాలకు ఒక వాహనం మాయమవుతున్నట్లు అంచనా. ఎక్కువగా కార్లు చోరీకి గురవుతోన్న రెండో నగరంగా బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. కాగా.. దేశంలో అతి తక్కువ వాహన చోరీలు జరుగుతోన్న నగరాలుగా హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతాలు ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా వాహన చోరీలకు సంబంధించి ఏసీకేఓ ఇన్సూరెన్స్‌ (ACKO Insurance) కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

* దిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం, 2011 నుండి 2020 మధ్యకాలంలో కేవలం ఒక్క దిల్లీలోనే 3లక్షల వాహనాలు చోరీకి గురయ్యాయి.

దేశ రాజధానిలో నమోదవుతోన్న మొత్తం నేరాల్లో 20శాతం వాహన చోరీ కేసులే ఉండటం గమనార్హం.

రోహిణి, భజన్‌పురా, ఉత్తమ్‌నగర్‌, సెక్టార్‌ 12 నోయిడా, సౌత్‌ సిటీ I, గురుగ్రామ్‌, దయాళ్‌పుర్‌తోపాటు సుల్తాన్‌పుర్‌ ప్రాంతాలు ఈ దొంగతనాలకు కేంద్రంగా మారాయి.

దేశ రాజధానిలో అత్యధికంగా వాగన్‌ ఆర్‌, స్విఫ్ట్‌ డిజైర్‌ మోడల్‌ కార్లే చోరీకి గురవుతున్నాయి.

తర్వాతి స్థానాల్లో హ్యూందాయ్‌, సాంత్రో, హోండా సిటీ కార్లు ఉన్నాయి. సాధారణంగా డిమాండ్ అధికంగా ఉన్న కార్లే చోరులకూ ఇష్టమైనవిగా నివేదిక బట్టి తెలుస్తోంది.

ద్విచక్రవాహనాల విషయానికొస్తే.. హీరో స్ప్లెండర్‌ మోడల్‌ అధికంగా దొంగతనాలకు గురవుతోంది.

హోండా, హీరో, బజాజ్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలకు చెందిన బైకులు ఎక్కువగా చోరీకి గురవుతోన్న వాహనాల జాబితాలో వరుస క్రమంలో ఉన్నాయి.

దేశంలో వాహన చోరీలు అధికంగా ఉన్న జాబితాలో దిల్లీ తర్వాత.. బెంగళూరు, చెన్నై నగరాలు నిలిచాయి. దేశం మొత్తంలో జరిగే చోరీల్లో 9శాతం బెంగళూరులో, 5శాతం చెన్నైలలో జరుగుతున్నట్లు అంచనా.

దేశంలో అతి తక్కువ వాహన చోరీలు చోటుచేసుకుంటున్న నగరాలుగా హైదరాబాద్‌, ముంబయి, కోల్‌కతాలు నిలిచినట్లు తాజా నివేదిక తెలిపింది.

భవనాలు, కాలనీల్లో పార్కింగ్‌కు సరైన స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను పార్కింగ్‌ చేయడం.. దిల్లీలో అధికంగా చోరీలు జరగడానికి ప్రధాన కారణంగా తాజా నివేదిక విశ్లేషించింది.

దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ అధికంగా దిల్లీలోనే ఉండడం ఇందుకు మరో కారణం.

దిల్లీ నగరంతో ఇతర రాష్ట్రాల సరిహద్దు అతి చేరువలో ఉండటం.. దొంగతనం చేసే వారు తేలికగా తప్పించుకునే అవకాశం ఉండటం అక్కడ ఎక్కువ వాహన దొంగతనాలకు మూడో కారణంగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని