Rahul Gandhi: నేపాల్‌ నైట్ క్లబ్‌లో రాహుల్‌ ‘పార్టీ’.. వీడియోతో విరుచుకుపడ్డ భాజపా

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయనతో పాటు చైనా రాయబారి

Updated : 03 May 2022 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయనతో పాటు నేపాల్‌లోని చైనా రాయబారి కూడా ఉన్నట్లు వార్తలు రావడంతో భాజపా విరుచుకుపడింది. కొందరు భాజపా నేతలు ఈ వీడియోను తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు.

ఈ వీడియోలో ఉన్నది కాఠ్‌మాండూలోని ఓ పాపులర్‌ నైట్‌క్లబ్‌ అని తెలుస్తోంది. తన జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌ సోమవారం నేపాల్‌ వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. రాహుల్‌ తన స్నేహితులతో కలిసి మారియట్‌ హోటల్‌లో బస చేసినట్లు తెలిపాయి. అయితే ఈ వీడియో గురించి ఆ కథనాలు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వీడియోలో రాహుల్‌తో కన్పిస్తోన్న మహిళ నేపాల్‌లోని చైనా రాయబారి అని తెలుస్తోంది. దీంతో భాజపా భగ్గుమంది.

ఈ వీడియోను భాజపా నేత కపిల్‌ మిశ్రా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘ఆ వీడియోలో ఉన్నది ఎవరు?’’ అని ప్రశ్నించారు. రాహుల్‌ వ్యక్తిగత జీవితం గురించి తమకు అవసరం లేదని, అయితే చైనీస్‌ ఏజెంట్లతో ఉంటే మాత్రం కచ్చితంగా ప్రశ్నించాల్సిందేనని అన్నారు. భాజపా ఐటీ కన్వీనర్‌ అమిత్‌ మాల్వియా పోస్ట్‌ చేస్తూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్‌ విదేశాల్లో నైట్‌క్లబ్‌ల్లో పార్టీ చేసుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు. ‘‘రాజస్థాన్‌లో మత ఘర్షణలు చోటుచేసుకుంటుంటే రాహుల్‌ మాత్రం పార్టీల్లో ఉన్నారు. ఈయన కనీసం పార్ట్‌ టైం రాజకీయనాయకుడు కూడా కాదు. ‘పార్టీ టైం’ పొలిటీషియన్‌’’ అని మరో భాజపా నేత ఎద్దేవా చేశారు

నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా..

అయితే ఈ వీడియోపై కాంగ్రెస్‌ స్పందిస్తూ భాజపాకు కౌంటర్‌ ఇచ్చింది. ఓ మిత్ర దేశంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లడం నేరమేమీ కాదని పేర్కొంది. ‘‘ప్రధాని మోదీ మాదిరిగా రాహుల్‌ గాంధీ ఏం పాకిస్థాన్‌లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్‌ షరీఫ్‌తో కేక్‌ కట్‌ చేయలేదు కదా. జర్నలిస్టు ఫ్రెండ్‌ వివాహానికి హాజరయ్యేందుకు మిత్ర దేశమైన నేపాల్‌ వెళ్లారు. ఇందులో తప్పేం లేదు. ఇదేం నేరం కాదు. బహుశా.. స్నేహితులు, కుటుంబసభ్యుల పెళ్లిళ్లకు వెళ్లడాన్ని కూడా నేరంగా భావిస్తూ భాజపా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదేమో’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా దుయ్యబట్టారు. 2015లో ప్రధాని మోదీ అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె వివాహానికి అనూహ్యంగా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ సుర్జేవాలా విమర్శించారు. 

ఇదిలా ఉండగా.. కొద్ది గంటల క్రితమే ప్రధానమంత్రి మూడు దేశాల పర్యటనపై కాంగ్రెస్‌ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘‘దేశం సంక్షోభంలో ఉంటే.. సాహెబ్‌ విదేశాల్లో ఉన్నారు’’ అని కాంగ్రెస్‌ విమర్శించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని