థ్యాంక్యూ మినిస్టర్‌.. నాకు గ్రేస్‌ మార్కులేం కలపలేదుగా: కాంగ్రెస్‌ నేత సెటైర్‌

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే) పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించడం లేదని విమర్శలు వ్యక్తం అవుతోన్న తరుణంలో కాంగ్రెస్ (Congress) వ్యంగ్యంగా విమర్శలు చేసింది. 

Published : 24 Jun 2024 12:08 IST

దిల్లీ: 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju), సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. ఈ క్రమంలో నీట్‌, యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించిన ఎన్టీయే(national testing agency) ప్రస్తావన వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

18వ లోక్‌సభ తొలి సమావేశాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను సభకు సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా సభ్యులకు సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. సమన్వయంతో సభను నడుపుదామని ఆకాంక్షించారు. ‘‘చెప్పే పదాల కంటే చేసే పనులే గట్టిగా మాట్లాడుతాయి. మాటల్లో కాదు.. చేతల్లో చూపించండి మినిస్టర్‌’’ అంటూ జైరాం రమేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

 50ఏళ్ల క్రితం నాటి పొరబాటు మళ్లీ జరగొద్దు: ‘ఎమర్జెన్సీ’పై మోదీ కీలక వ్యాఖ్యలు!

దానిపై రిజిజు స్పందిస్తూ.. ‘‘తప్పకుండా రమేశ్‌జీ. మీరొక తెలివైన వ్యక్తి. మీరు సానుకూలంగా మీ సేవలు అందిస్తే.. ఈ సభకు మీరొక విలువైన ఆస్తిగా మారతారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. దేశానికి సేవలు అందించే విషయంలో మనమంతా ఒక దగ్గరకు చేరాం. ఈ పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించే విషయంలో మీ సహకారం అందుతుందని ఆశిస్తున్నాం’’ అని బదులిచ్చారు. దీనికి ఇటీవల ఎన్టీయే వివాదాన్ని ముడిపెడుతూ జైరాం రమేశ్‌ కౌంటర్ ఇచ్చారు. ‘‘థ్యాంక్యూ రిజిజు. నా ఇంటిలిజెన్స్‌కు మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఎన్టీయే తరహాది కాదనుకుంటున్నా. దానికేం గ్రేస్‌ మార్కులు కలపలేదుగా..?’’ అని ఎద్దేవా చేశారు.

నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల్లో అవకతవకల వేళ.. కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే) పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సందర్భంగా పారదర్శకత పాటించడం లేదని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నీట్‌లో అక్రమాలపై సీబీఐ పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోంది. అలాగే బిహార్‌లో పేపర్‌ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్‌ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా దర్యాప్తు చేయనుంది. వీటిని ఉద్దేశించే జైరాం రమేశ్‌ స్పందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని