Aryan Khan drug case: ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూయిజ్ డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

Updated : 02 Apr 2022 11:35 IST

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్ డ్రగ్స్‌ కేసులో కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్‌ మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు.. అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ప్రభాకర్ ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు వచ్చిందని..  ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని చెప్పారు. ప్రభాకర్ ముంబయిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అతడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

గత అక్టోబర్‌లో ముంబయి నగర శివారు తీరప్రాంతంలోని క్రూజ్‌ నౌకలో జరుగుతోన్న రేవ్‌ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌, మరికొంతమందిని అరెస్టు చేశారు. ఎన్‌సీబీ కొందరిని సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేటు డిటెక్టివ్‌ కేపీ గోసవి ఒకరు. ఆయన బాడీగార్డు ప్రభాకర్ సెయిల్‌. ఎన్‌సీబీ అతడిని కూడా విచారించింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న అతడు తర్వాత దర్యాపు సంస్థపై, అప్పటి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో గోసవి-ఎన్‌సీబీ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని, వాంఖడే నుంచి తనకు ప్రాణాపాయం పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడిస్తూ.. నార్కొటిక్ డ్రగ్స్‌ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మరో సాక్షి శామ్ డిసౌజా.. గోసావి, సెయిల్ డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఈ సమయంలోనే సెయిల్ మృతి చెందారు. ఇక ఈ కేసులో అక్టోబర్‌లో అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని