Gold Ornaments: 43 సవర్ల బంగారం తెచ్చి.. ఏటీఎం చెత్తబుట్టలో వేసి..!

ఓ మహిళ 43 సవర్ల బంగారాన్ని ఏటీఎం గదిలోని చెత్తబుట్టలో పడేసింది. దాని విలువ అక్షరాల రూ.15 లక్షలు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కుంద్రతూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.

Updated : 06 Jul 2022 17:26 IST

చెన్నైలో విచిత్ర ఘటన

చెన్నై: ఓ మహిళ 43 సవర్ల బంగారాన్ని ఏటీఎం గదిలోని చెత్తబుట్టలో పడేసింది. దాని విలువ అక్షరాల రూ.15 లక్షలు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కుంద్రతూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. 

చెన్నైలోని ఒక ఏటీఎంలో పనిచేస్తోన్న సెక్యూరిటీ గార్డ్‌ చెత్తబుట్టలో లెదర్ బ్యాగు కుక్కి ఉండటాన్ని గమనించారు. వెంటనే తీసి, దాన్ని తెరిచి చూడగా, బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆ గార్డు బ్యాంకు మేనేజర్‌కు విషయం తెలియజేయగా.. కుంద్రతూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీటీవీ దృశ్యాలను గమనించగా.. ఓ మహిళ ఆ బ్యాగును పడేసినట్లు గమనించారు. మరోపక్క అదే రోజు తమ 35 ఏళ్ల కుమార్తె తప్పిపోయిందని ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి ఆమె ఇంట్లో కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఏడు గంటలకు ఇంటికి వచ్చిందని తిరిగి పోలీసులకు ఆ తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉండొచ్చని అనుమానించిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను వారికి చూపించగా.. బుట్టలో బ్యాగు వేస్తూ కనిపించిన మహిళ తమ కుమార్తెనని వారు గుర్తించారు. 

ఆమె ప్రవర్తనకు గల కారణాల గురించి పోలీసులు ఆరా తీశారు. తమ కుమార్తె గత కొద్దినెలలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతోందని వెల్లడించారు. అలాగే ఆమెకు నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందని చెప్పారు. కేసు వివరాలు పరిశీలించిన పోలీసులు ఆ బంగారాన్ని వారికి అప్పగించారు. అలాగే నిజాయతీతో వ్యవహరించిన బ్యాంకు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని