Jammu and Kashmir: మొన్న టీవీ నటి.. ఇప్పుడు టీచర్.. ఉగ్రమూకల చేతిలో బలవుతోన్న పౌరులు..!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి.

Updated : 31 May 2022 15:10 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ మహిళలు, సామాన్య ప్రజలపై దాడులు పెరుగుతున్నాయి. మంగళవారం కుల్గాంలోని గోపాల్‌పొరలో ఉగ్రమూకలు ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

మృతురాలు జమ్ము డివిజన్‌లోని సాంబా ప్రాంతానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఆమె పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పాఠశాల సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని, గాలింపు చేపడుతున్నాయి. ఇటీవల కాలంలో ముష్కరుల చేతిలో సామాన్య ప్రజలు బలవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మే 12న బుద్గాం జిల్లాలో రెవెన్యూ విభాగానికి చెందిన ఉద్యోగి రాహుల్ భట్ బలయ్యారు. గతవారం టీవీ నటి అమ్రీన్ భట్ ఉగ్రమూకల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. చదూరలోని ఆమె నివాసంలో రాత్రి వేళ లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

పౌరులపై వరుసగా జరుగుతోన్న దాడులను జమ్మూకశ్మీర్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘ఇది చాలా బాధాకరం. నిరాయుధులైన సామాన్య ప్రజలపై వరుసగా జరుగుతోన్న లక్షిత దాడుల్లో ఇది మరొకటి’ అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందించారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయంటూ కేంద్రం తప్పుడు వివరాలు వెల్లడిస్తున్నప్పటికీ.. లక్షిత హత్యలు పెరుగుతున్నాయి’ అంటూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని